తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపేందుకు అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇవాళ సచివాలయంలో మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే తుమ్మల మూడు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో రూ.1050 కోట్లతో 5 పామాయిల్ పరిశ్రమలు స్థాపించే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు. రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ.4.07కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో రైతు వేదికల్ని తీర్చిదిద్దేందుకు రెండో సంతకం చేశారు. ఈ రైతు వేదికల్లో రైతులకు పంటల సాగులో అత్యాధునిక సాగుపద్దతులపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబుకు తలకాయ ఉండి ఆ లేఖలు రాస్తున్నాడా??
ఇక, వ్వయసాయ శాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికల్ని తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు గానూ వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యల కోసం మంత్రి మూడో ఫైల్ పై సంతకం చేశారు. రాష్ట్రంలోని సహకార కమిషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలతో పాటు జిల్లా సహకార కార్యాలయాల్లో అన్ని రకాల కార్యకలాపాలను కంప్యూటరీకరించాలని అధికారులకు తుమ్మల సూచించారు. ఈ సందర్భంగా గద్వాలకు చెందిన పట్టు పరిశ్రమశాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్ కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రం అందజేశారు.
Read Also: World Records: వామ్మో .. క్యాండీలను గడ్డానికి గుచ్చి వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు..
ఈ సందర్భంగా అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నెల కొల్పుతామన్నారు. పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానో ఉపయోగపడుతుంది తెలిపారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంట సాగుకు అనుకూలంగా ఉన్నాయని మంత్రి అన్నారు. పామాయిల్ సాగు రైతు మూలధన పెట్టుబడి పెంచుతుంది.. ఉపాధి కల్పన పెంచడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది అని తుమ్మల చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోకుండా తెగుళ్ల దాడుల ప్రమాదాలను తగ్గించడం వంటివి పామాయిల్ సాగులోనే సాధ్యమవుతుందన్నారు. సుమారు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడినిచ్చే దీర్ఘకాలిక పంటగా రైతుకు స్థిరమైన ఆదాయం ఇస్తుందన్నారు. ముడి పామాయిల్ శుద్ధి చేసిన నూనెల ఉత్పత్తి రాష్ట్రానికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పన్ను ప్రయోజనాలు అందిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Read Also: Hamas War: ఇజ్రాయిల్ తదుపరి లక్ష్యం హమాస్ నాయకత్వమే.. అమెరికా కీలక వ్యాఖ్యలు..
పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుతో రైతులకు ఎళ్ల వేళలా మార్కెట్ అందుబాటులోకి వస్తుంది.. దీంతో రైతుకు దక్కాల్సిన సొమ్ము చెల్లింపులు త్వరితగతిన పూర్తవుతాయని మంత్రి తుమ్మల అన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులు ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుస్తుందన్నారు. ఇంకా అంతర పంటలతో అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. పరిశ్రమల స్థాపనతో ప్రతీ జిల్లాలో ప్రత్యక్ష, పరోక్షఉపాధి సృష్టించవచ్చన్నారు. టీఎస్ ఆయిల్ ఫెడ్ 2023-24 నుంచి ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణం పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.