డిసెంబర్ 28కు ఎంతో చారిత్రక నేపథ్యముందని, అందుకే అదేరోజున ప్రజా పాలనకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ , శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా తొలిసారిగా ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో జిల్లాకు విచ్చేసిన ఆమె ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రజా పాలనపై సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రజా పాలనకు నాంది పలుకుతున్నామన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధికే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. సబ్బండవర్ణాలను దృష్టిలో పెట్టుకొనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మాట ఇచ్చానమని, దానిని తప్పకుండా నిలబెట్టుకుంటామని వెల్లడించారు. అందుకోసం వందరోజుల టైం బాండ్ పెట్టుకున్నామని, కచ్చితంగా నెరవేర్చి తీరుతామని భరోసా ఇచ్చారు. ఎంతో చారిత్రాత్మకమైన సందర్భం డిసెంబల్ 28 అంటూ చెప్పారు. ఆ సందర్భంలోనే ప్రజా పాలనకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
Also Read : Saripodhaa Sanivaaram: గ్యాప్ ఇచ్చి పనిలో పడిన నాని!
గత పాలకులిచ్చిన హామీలేవీ అమలు చేయలేదని, తమ హామీల విషయంలో దుష్ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి జిల్లాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లాగా కలిసి పనిపనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను చివరి గూడెం, చిట్టచివరి గడపవరకు చేర్చాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉందన్నారు. ఇవాళ్టి సాయంత్రం నుండే దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అన్నారు. దూరాభారం, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు అధికారులే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చారు. ప్రతీ పథకానికి సంబంధించిన కాలమ్స్ దరఖాస్తు ఫారంలో ఉన్నాయన్నారు. అలాగే ఆదివాసీలపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.