Seethakka In Assembly: తెలంగాణ శాసన మండలిలో గురుకుల పాఠశాలల్లో కలుషిత ఆహార సమస్యలపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, హాస్టల్ సిబ్బందితో పాటు సరఫరాదారులపై కూడా నిఘాను పెంచుతామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 70 సంఘటనలు నమోదయ్యాయని, అందులో 5024 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని మంత్రి సీతక్క గుర్తుచేశారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ పరిస్థితి విషమించినప్పుడే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని నిమ్స్‌లో శైలజను మంత్రులు, సీఎంవో సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారని మంత్రి వివరించారు. గత పాలనలో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకోలేదని, నిరుద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలను కూడా పరామర్శించలేదని సీతక్క ఆరోపించారు. గడిచిన ఏడు సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలను పెంచినట్టు, 16 ఏళ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను పెంచి గురుకులాల్లో విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆమె పేర్కొన్నారు.
Also Read: Secretariat Employees Association Elections: సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. మాకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తెలుసు, టీఆర్ఎస్ వాళ్ల లాగా యాక్టింగ్ రాదని ఆమె వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ నుంచి హుందాతనం నేర్చుకోవాల్సిన అవసరం లేదని, వారు మాట్లాడితే అహంకారమే కనిపిస్తోందని ఆమె విమర్శించారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఒక అధికారి పదవికి రాజీనామా చేశాక టీఆర్ఎస్ పాలనపై అనేక ట్వీట్లు చేశారని, అవి బయటకు తీసుకురావాలని నిర్ణయించినట్టు సీతక్క తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయదని, అన్ని చర్యలను తీసుకోవడంలో ముందు ఉంటుందని సీతక్క స్పష్టం చేశారు.