సచివాలయంలో మిషన్ భగీరథపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలను మంత్రికి అధికారులు నివేదించారు. ఇప్పటి వరకు ఎక్కడా తాగునీటి సమస్య లేదని అధికారులు తెలిపారు. ఏదేని గ్రామంలో సమస్యలు తలెత్తిన వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించి తాగునీటి సమస్యలు లేకుండా చూస్తున్నామని అధికారులు చెప్పారు.
Read Also: Crime News: ఈసీఐఎల్‌లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిపై కొడుకు కత్తితో దాడి
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వేసవిలో ఎలాంటి తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి.. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంప్ హౌస్ మోటర్లలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. ఈఎన్సీ నుంచి గ్రామ స్థాయి వరకు మిషన్ భగీరథ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రోజు తాగు నీటి సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టి నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఎక్కడైన సాంకేతిక సమస్యలు తలెత్తినా తక్షణం పరిష్కరించాలని మంత్రి అధికారులకు తెలిపారు. సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలున్నందున, ఈ వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైతే జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఫండ్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.