భారత్-పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మంత్రి సవిత అందించారు. మురళీ తల్లిదండ్రులకు రూ.50 లక్షల రూపాయల చెక్కు ప్రభుత్వం తరఫున అందజేశారు. అంతకుముందు మురళీ నాయక్ చిత్రపటానికి మంత్రి సవిత నివాళి అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మురళీ నాయక్ తల్లిదండ్రులకి చెక్కును అందించిన అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.50 లక్షల చెక్, 5 ఎకరాల పొలం, 6 సెంట్ల స్థలం మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశాం. వీర జవాన్ మురళీ నాయక్ సమాధిని 14 లక్షలతో నిర్మించాం. మురళీ ఊరి పేరు కూడా మురళీ నాయక్ తండాగా మార్చే ప్రక్రియ చేపట్టాం. విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం. వీర జవాన్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని మంత్రి సవిత హామీ ఇచ్చారు.
మే 8న రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాలో జవాన్‌కు అధికార లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు రూ.50 లక్షల చెక్, 5 ఎకరాల పొలం, 6 సెంట్ల స్థలంను మురళీ తల్లిదండ్రులకు అందజేశారు.