NTV Telugu Site icon

RK Roja: బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమేనా.. అసెంబ్లీలో చేతకాదా?

Rk Roja

Rk Roja

RK Roja: టీడీపీ నేతలు సభకు చర్చకోసం కాదు.. రచ్చ కోసం వచ్చారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. టీడీపీ నేత బాలకృష్ణపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీ బావ తుప్పు కాదు.. నిప్పు అని ఒప్పుకోవడానికి మనసు రావడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. బాలకృష్ణకు చంద్రబాబు సీటు మీద మనసు లాగినట్లుంది.. అందుకే చంద్రబాబు కుర్చీ ఎక్కి విజిల్స్ వేసి పిచ్చి పిచ్చి వేషాలేశాడని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. బాలకృష్ణ అసెంబ్లీలో తొడగొట్టడం కాదు.. మీకు చేతనైతే హైకోర్టుకు పోయి జడ్జి ముందు తొడకొట్టండి అంటూ రోజా అన్నారు. యువతను చంద్రబాబు మోసం చేశాడని ప్రజలు, యువత గమనించారన్నారు. ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు జైలుకి పోతే…జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. గజదొంగ చంద్రబాబు సాష్టాంగపడి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇక్కడ దోచుకుని పక్కరాష్ట్రంలో ప్యాలెస్‌లు కట్టిన చంద్రబాబు ఏపీ ప్రజల కాళ్లు మొక్కి క్షమాపణ కోరాలని ఆమె అన్నారు.

Also Read: Minister Chelluboina Venu: ఈరోజు సభలో ప్రతిపక్షం తీరు సభా చరిత్రలో దుర్దినం

టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చి ఎందుకు పారిపోయారని.. చంద్రబాబు స్కామ్ చేశాడని, దోచుకున్నాడని టీడీపీ నేతలకు కూడా తెలుసని ఆమె పేర్కొన్నారు. టీడీపీ నేతలకు కూడా స్కిల్ స్కామ్‌లో వాటా ఉందా.. బాలకృష్ణ ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు. బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమే డైలాగ్ చెప్పడం వచ్చా.. అసెంబ్లీలో మాట్లాడటం చేతకాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుండి పార్టీని నడిపిస్తానని చెప్పిన బాలయ్య ఎందుకు పారిపోయాడంటూ ప్రశ్నించారు. మా దగ్గర ఆధారాలు లేవని చెబుతున్న మీరు ఎందుకు చర్చ నుంచి పారిపోయారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ స్కామ్‌కు పథకం వేశాడని ఆమె ఆరోపించారు. జీవోలో లేనప్పుడు ఒప్పందాలపై ఎలా సంతకాలు చేశారని మంత్రి రోజా అడిగారు.

Also Read: Chandrababu: సీఐడీ కస్టడీకి చంద్రబాబు

బాలకృష్ణ, టీడీపీ నేతలకు ఇదే నా ఛాలెంజ్ అంటూ మంత్రి రోజా సవాల్‌ విసిరారు. సోమవారం వస్తారో… మంగళవారం వస్తారో..బుధవారం వస్తారో మీ ఇష్టమని, స్కిల్ స్కామ్ మొదలు చంద్రబాబు అన్ని స్కాముల పైనా చర్చిద్దామంటూ మంత్రి రోజా ఛాలెంజ్ విసిరారు. బాలకృష్ణ సినిమాల్లో రాసిచ్చిన డైలాగులు చెప్పడం కాదు.. అసెంబ్లీకి వచ్చి మా బావ తప్పు చేయలేదు..ఈడీ ఎంక్వైరీ వేయండి అని అడగాలన్నారు. ఢిల్లీకి వెళ్లి బహిరంగ చర్చకు రమ్మని లోకేష్ సవాల్ విసురుతున్నాడని.. లోకేష్ నీకెలాగూ సభకు వచ్చే సీన్ లేదని ఆమె వ్యాఖ్యానించారు. బాలకృష్ణను సభకు పంపించు.. తాము చర్చకు సిద్ధమని లోకేష్‌కు సవాల్‌ విసిరారు. టీడీపీ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైందన్నారు మంత్రి రోజా. వ్యవస్థలను దోచుకున్న చంద్రబాబు ఎన్నికల ముందు ఇలా దొరికిపోయానేంటో అనే భయంలో ఉన్నారని ఆమె వెల్లడించారు. టీడీపీ నేతలు ప్రజల సమస్యలను తీర్చే బదులు ప్రజలకు సమస్యగా మారారని ఆమె విమర్శించారు. టీడీపీ పాపాలు పండాయని.. ఇకపై మా నాయకుడి గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ మాట్లాడితే సహించేది లేదని మంత్రి రోజా తెలిపారు.