Minister Ram Prasad Reddy: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట భూ నిర్వాసితులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. అన్నమయ్య, పించా డ్యాములు తెగిపోయి ప్రాణాలు కోల్పోయిన వారిని కానీ నష్ట పోయిన వారిని కానీ జగన్ ఒక్కరినైనా ఆదుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు విజయవాడలో వరద బాధితులకు జరుగుతున్న సహాయకచర్యలపై అవాకులు చవాకులు మాట్లాడడం సబబు కాదన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అన్యాయాలు జరిగాయని ఆయన విమర్శించారు.
మంగంపేట గ్రామస్తుల నుండి వారి తాత ముత్తాతలు ఇచ్చిన భూములు తీసుకొని స్థానికులను పక్కన పెట్టేశారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ చెప్పారని నార్త్ఇండియాలోని వారిని ఇక్కడ తెచ్చి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. రాబోయే ఐదు ఏళ్లలో మంగంపేటకు మహర్దశ పడుతుందన్నారు. ప్రతిఒక్క నిర్వాసితుడిని తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.