తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతోంది. రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాలు సైతం మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. మునుగోడులో జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రత్యర్థులను దాటి ముందుకు వెళ్లేందుకు ఇంటింటి ప్రచారాలు, హామీలు గుప్పిస్తున్నారు. అయితే.. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నిక బరిలో ఉండగా, టీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వయి స్రవంతిలు పోటీలో ఉన్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఎండగడుతూ తమ పార్టీ అభ్యర్థికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నాగారంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Also Read : Jagadish Reddy : ఈ ఉప ఎన్నిక కేవలం బీజేపీ రాజకీయ స్వార్థం కొరకు వచ్చింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కేసీఆరేనని, డబ్బులకు అమ్ముడు పోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని తరిమికొట్టాలన్నారు. కొయ్యలగూడెం నుండి పాలపాడు వరకు తారు రోడ్డు వేయించే బాధ్యత నాదని, కుల సంఘాలకు భవనాలు నిర్మించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అదేవిధంగా కేసీఆర్ చేస్తున్నారని, అభివృద్ది చేసే గుర్తు టీఆర్ఎస్ కారు గుర్తు.. అమ్ముడు పోయిన గుర్తు బీజేపీ పువ్వు గుర్తు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మునుగోడు ప్రజలు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని అసహ్యించు కుంటున్నారని, ఈసీ ని అడ్డం పెట్టుకొని బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తోందన్నారు. ఈసీ వైఖరి అభ్యంతరకరమన్న ఆయన.. 2011లో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తు మళ్లీ ఎలా కేటాయిస్తారు..? అని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు చైతన్య వంతులు… అన్ని గమనిస్తున్నారని, బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారన్నారు.