Minister Ponnam Prabhakar: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని శుభం గార్డెన్‌లో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయని, వచ్చే ఆగష్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. వచ్చే వానాకాలం పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు.
Read Also: Bhatti Vikramarka: రుణమాఫీ వంద రోజుల్లో చేస్తాం అనలేదు.. కానీ కట్టుబడి ఉన్నాం..!
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేశాడా, ఏదైనా గ్రామంలో తిరిగాడా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వాళ్ళ పార్టీ నేతలతో కూడా చేయి కలపరని ఆయన విమర్శించారు. తాను ఎంపీగా అయిదు సంవత్సరాలు ఏం చేశానో, బండి సంజయ్, వినోద్ కుమార్ ఎంపీలుగా ఏం చేశారో చర్చిద్దామని సవాల్ విసిరారు. బండి సంజయ్ ఎంపీగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తేలేదు, బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు, బీఆర్ఎస్‌కు ఓటు వేసి వృధా చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన సూచించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, హుస్నాబాద్ నియోజకవర్గంలోని 304 బూతులలో పార్టీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.