వైసీపీ నేతలు లిక్కర్ పాలసీ అక్రమం అంటున్నారు, ఇవాళ ఉన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో ఉన్న మద్యం పాలసీనే అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్ర ప్రజానీకానికి ఉచితంగా ఇసుక తోలుకోమని చెప్పింది తన ప్రభుత్వమే అని, వైసీపీ పాలనలో గ్రామ స్థాయి నుంచి తాడేపల్లి వరకు కప్పం కట్టారని ఎద్దేవా చేశారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్.. ఇలా అన్ని స్కాములు జరిగింది మీ హయాంలోనే అని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని, రూ.3.5 లక్షల కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టారని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు.
అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ… ‘వైఎస్ జగన్ తన అస్తిత్వం కాపాడుకోవడానికి ఉన్నవి లేనివి చెబుతున్నాడు. అమరావతిపై విషం చిమ్మడానికి, అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మాటలు పరిశ్రమలు రాకూడదు అన్నట్లు ఉంది. మీడియా సమావేశం అంటే నాలుగు సలహాలు ఇస్తాడు అనుకున్నాం. లిక్కర్ పాలసీ అక్రమం అంటున్నారు, ఇవాళ ఉన్నది మీ నాన్న హయంలో ఉన్న మద్యం పాలసీనే జగన్. అప్పుడు స్కాం కనిపించ లేదా? జగన్. రాష్ట్ర ప్రజానీకానికి ఉచితంగా ఇసుక తోలుకోమని చెప్పింది మా ప్రభుత్వం. మీ పాలనలో గ్రామ స్థాయి నుంచి తాడేపల్లి వరకు కప్పం కట్టారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్ అన్ని స్కాములు జరిగింది మీ హయాంలోనే. రివర్స్ టెండరింగ్‌తో పోలవరం ఖర్చు మూడింతలయింది. జగన్‌కి ఎక్కడో భయం కలిగి ఈ మాటలు మాట్లాడుతున్నారు’ అని అన్నారు.
Also Read: Murali Naik: తిరుచానూరు పద్మవతి అమ్మవారి కుంకుమతో వీరజవాన్ చిత్రపటం!
‘3.5 లక్షల ఎకరాలకు ఏ ఆధారం లేకుండా ఫ్రీ హోల్డ్ చేశారు. అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి. విశాఖను నాశనం చేశారు, పరిశ్రమలు తరిమేశారు. గతంలో మీరు చేసిన అరాచకాలు ఇంకా గుర్తు ఉన్నాయి. మా హయాంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అనంతపురం జిల్లాకు 22 వేల కోట్లతో రెన్యూ వచ్చింది. ఐదేళ్ల పాలనలో 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. రూ. 3.5 లక్షల కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. 94 కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆపారు. మీరు చేసిన అప్పులకి వడ్డీ చెల్లించేందుకే అప్పులు చేయాల్సి వస్తోంది. రాజశేఖర్ రెడ్డి రూపాయికి ఎకరా భూమిని కట్టబెట్టారు. ఆరోజు ఇడ్లీ రూపాయికి వస్తుందా?. మీలాగా మూడు లక్షల ఎకరాలు కొట్టేయలేదు. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు తెరపైకి వస్తే మీ అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు గుర్తుకు వస్తాయి. మీ హయంలో లక్షకి పైగా పిల్లలు డ్రాప్ ఔట్ అయ్యారు. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం ఎలాగో.. ఏపీకి వైసీపీ కూడా అంతే హానికరం’ అని మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు.