Minister Nimmala Rama Naidu: భారీ వర్ష సూచనతో ప్రభుత్వం అలెర్ట్ అయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. ప్రాజెక్టుల్లో ఇన్ ఫ్లోస్ మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. సోమశిల రిజర్వాయరుకు గతంలో ఎన్నడు రానంత వరద ఈ సారి వస్తోందన్నారు. ముందుగానే చెరువులు, వాగులు, రిజర్వాయర్లు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఇటీవల కాలంలో అకస్మాత్తుగా వరదలు వస్తున్నాయని పేర్కొన్నారు. వరదలు వచ్చినా ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప వంటి జిల్లాల్లో వాగుల్లో ప్రవాహాలను పరిశీలిస్తున్నామన్నారు. వాగుల పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Read Also: AP CM Chandrababu: రతన్ టాటాకు నివాళిగా ఆయన పేరుతో హబ్.. సీఎం ట్వీట్
వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. ఆర్టీజీఎస్ సహకారంతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ఇంకా కొన్ని జలశయాల్లో నీరు నింపలేని పరిస్థితి నెలకొందని.. గత ఐదేళ్ల పాపం రాష్ట్రాన్ని పీడిస్తోందని విమర్శించారు. పెన్నా బేసిన్లోని రిజర్వాయర్లల్లో నీటిని నింపలేకపోతున్నామన్నారు. గత ఐదేళ్లల్లో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారని.. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రిజర్వాయర్లల్లో నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏపీలోని రిజర్వాయర్లల్లో మొత్తంగా 760 టీఎంసీల కెపాసిటీతో నీటిని నిల్వ చేయొచ్చని వెల్లడించారు. ప్రస్తుతం 680 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామన్నారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. వరదలు, వర్షపు నీటిని ఒడిసి పట్టేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వ్యాఖ్యానించారు. నవంబర్ నెల నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల వారీగా మరమ్మతులు చేపడతామన్నారు. నవంబర్ నెల నుంచే పోలవరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభించనున్నామని మంత్రి వెల్లడించారు. పోలవరం పనులపై వర్క్ క్యాలెండర్ రూపొందిస్తున్నామని తెలిపారు. డయాఫ్రం వాల్ పనులు కూడా నవంబర్ నెల నుంచే ప్రారంభం అవుతాయన్నారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఈ నెలాఖరులోగా కాపర్ డ్యాంల మధ్యలో నిల్వ ఉన్న నీటిని తోడేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జగన్ అనే భూతాన్ని సీసాలో పెట్టి బిరడా పెట్టామని.. ఆ సీసాకున్న బిరడా తిరిగి రాకుండా చూస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.