Nara Lokesh Praja Darbar: ప్రజాదర్బార్ లో వచ్చే సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 47వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు లోకేష్.. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తమ 320 చదరపు గజాల స్థలాన్ని ఆరుగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఆక్రమించిందని, విచారించి తగిన న్యాయం చేయాలని పూడిపర్తి గ్రామానికి చెందిన పోతిరెడ్డి ఇందిరమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన తండ్రి గుండెపోటుతో 2006లో మరణించారని, అన్ని అర్హతలు ఉన్న తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాలని నర్సరావుపేట మండలం రావిపాడుకు చెందిన సరిశెట్టి సాయి సునీత కుమారి విజ్ఞప్తి చేశారు. తనను లైంగికంగా వేధించిన తణుకు ఎస్.సి.ఐ.ఎమ్ ప్రభుత్వ కళాశాల సూపరిండెంట్ కేవీఎస్ రాజేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తానేటి రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. టీడీపీ సానుభూతిపరులమనే కక్షతో గత వైసీపీ పాలనలో తమపై అక్రమంగా కేసులు నమోదు చేయడంతో పాటు విలువైన తమ భూములు ఆక్రమించుకున్నారని సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం రెక్కమానుకు చెందిన కుమ్మరసాని సుధాకర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: HYD Metro: త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు చేస్తాం: ఎన్వీఎస్ రెడ్డి
ఇక, గుంటూరులోని ఎన్టీఆర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ(గుంటూరు మిర్చియార్డ్)లో కమీషన్ ఏజెంట్ లైసెన్స్ లు మంజూరు చేయాలని షేక్ చిన్నబాజి, టి.లక్ష్మా రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2018లో కుటుంబ జీవనోపాధి కోసం కొంతమందికి మిర్చి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించేందుకు కమీషన్ లైసెన్స్ లు మంజూరుకు అప్పటి పాలకవర్గం, యార్డ్ సెక్రటరీ తీర్మానం చేశారని, అనంతరం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని కడప జిల్లా యర్రగుంట్ల మండలం ఇండ్లసిద్ధాయపల్లె భూ నిర్వాసితులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. హామీ ఇచ్చిన విధంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. అయితే అన్ని సమస్యలు విన్న మంత్రి నారా లోకేష్.. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..