ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండుకు చేరుకుంటారు. దత్త ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించే విధంగా షెడ్యుల్ ఫిక్స్ అయింది. 60 వేల మందికి పైగా ప్రధాని రోడ్ షో పాల్గొనే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు కిలోమీటరున్నర దూరం ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని రోడ్ షో చేస్తారు. పీఎం వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు.
కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి విశాఖకు వస్తున్నారు. ఉత్తరాంధ్ర చిరకాల కోరిక దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణం, పుడిమడకలో NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టుల్లో వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ రోడ్ షో, బహిరంగ సభ వేదిక, జనసమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ప్రధాన వేదిక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సభకు విశాఖ, అనకాపల్లి, ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల నుంచి దాదాపు 2 లక్షల మంది వస్తారని అంచనా. ఆ మేరకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. అటు, పుడిమడక, నక్కపల్లి దగ్గర పరిశ్రమలు ఏర్పాటయ్యే చోట ప్రధాని సభను వర్చువల్గా చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను స్వయంగా మంత్రి లోకేష్ పర్యవేక్షించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు.