Merugu Nagarjuna React on 125 feet statue of Ambedkar: సామాన్యుడైనా, వీవీఐపీ అయినా.. జైల్‌లో ఒకే విధంగా చూస్తారు అని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రోగాలు రాకుండా ఎవరైనా ఉంటారా? అని, వస్తే టాబ్లెట్ వేసుకోవడమే అని విమర్శించారు. కష్టపడి పని చేసే వారి గురించి మాట్లాడడం మానేసి.. దొంగల గురించి బాధపడుతున్నారా? అని మంత్రి నాగార్జున ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి మేరుగు నాగార్జున.. టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
‘రోగాలు ఎవరికైనా రాకుండా ఉంటాయా?.. రోగాలు వస్తే టాబ్లెట్ వేసుకోవడమే. సామాన్యుడైనా, వీవీఐపీ అయినా జైల్‌లో ఒకే విధంగా చూస్తారు. కష్టపడి పని చేసే వాళ్ల గురించి మాట్లాడ్డం మానేసి దొంగల గురించి బాధపడుతున్నారా?. దేశంలో ఎక్కడా లేని విధానంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నం. 80 అడుగుల పెడస్టల్..125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. అందుకు 400 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నాం. 100 కోట్లతో పెడతామని గత ప్రభుత్వం చెప్పింది కానీ చేయలేదు. ప్రభుత్వ పథకాలు ఎలా అమలు చేస్తున్నారో అలాగే విగ్రహ నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన అమలు అవుతుంది’ అని అన్నారు.
ముళ్ల పొదల్లో అంబేద్కర్ విగ్రహం పెడతామని గత ప్రభుత్వం చెప్పిందని దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ 10 మందికి తెలిసే విధంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని, త్వరలోనే విగ్రహ ఆవిష్కరణ జగన్ చేస్తారని సత్యనారాయణ తెలిపారు.