మేడారం సమ్మక్క సారక్క జాతరపై MCHRD లో మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి , డీజీపీ రవి గుప్తా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ అధికారులకు మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తికావడానికి అధికారులకు వర్క్ అసైన్ చేశారు.. 28 లోపు అన్ని పనులు పూర్తి అవుతాయని, గతంలో అక్కడ పని చేసిన అధికారులకు ట్రాఫిక్ జామ్ ,రూట్ క్లియారెన్స్ కోసం నోడల్ ఆఫీసర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చే జాతర లో ప్రధానంగా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మక్క సారక్క జాతర విజయవంతానికి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయం తో కలిసి పని చేయాలని, కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.
అంతేకాకుండా..’మహాలక్ష్మి పథకం ద్వారా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది.. ఈసారి 6 వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ప్రణాళికలు రచించింది… అదనంగా బస్సులు వేయడం వల్ల 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.. అందుకోసం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నాం.. బస్సులు మరిన్ని అవసరమైనప్పుడు ప్రైవేట్ బస్సులు , స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు ప్లాన్ చేసుకోవాలి… ఆర్టీసీ ,రవాణా అధికారులు సమన్వయం తో కలిసి పని చేయాలి..’ అని ఆయన వ్యాఖ్యానించారు.