ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరామన్నారు. విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదని.. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఏపీలో సినిమాలు తీసేందుకు చాలా లోకేషన్లు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. మండలిలో విశాఖలో సినీ పరిశ్రమపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. వీటిపై మంత్రి సమాధానాలు ఇచ్చారు.
‘విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదు. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తాం. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన ప్రదేశం విశాఖ. సినిమాలు తీసేందుకు మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టూడియోలు నిర్మించాలని కోరాం. ఏపీలో సినిమాలు తీసేందుకు చాల లోకేషన్లు ఉన్నాయి. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరాం. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో రామానాయుడు స్టూడియో కోసం 34.44 ఎకరాలు భూమి కేటాయించారు. దానిలో కొంతభాగం 15 ఎకరాల్లో లేఅవుట్ వేసి వేరే అవసరాల కోసం వాడాలని చూశారు. ఇచ్చిన ప్రభుత్వం వేరు.. వేరే అవసరాల కోసం వాడాలని చూసిన ప్రభుత్వం వేరు’ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
‘విశాఖలో గత ప్రభుత్వాల సమయాల్లో భూకేటాయింపులు జరిగాయి. అవి ఇప్పుడు చర్చించదలుచుకోలేదు కానీ.. అక్కడ భూములు తీసుకున్న వారు స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి. భవిష్యత్తులో కాకుండా.. వెంటనే కొనసాగించే ప్రయత్నం చేయాలి’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు.