Minister Kakani Goverdhan Reddy Fires on Chandrababu
టీడీపీ నేతలకు సమస్యల్ని సృష్టించి నానా యాగీ చేయడం అలవాటు అయిపోయిందంటూ విమర్శలు గుప్పించారు రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్. తాజాగా ఆయన నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్ యూనివర్సిటీకి పేరు మారిస్తే రాజకీయం చేస్తున్నారని, చంద్రబాబు గవర్నర్ ని కలిసిన తర్వాత కొన్ని స్టేట్ మెంట్స్ ఇచ్చారంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కళాశాల మేమే కట్టామని చెప్పారని, చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే ఈ కళాశాల నిర్మాణం పూర్తి అయ్యిందని ఆయన వెల్లడించారు. రిబ్బన్ కట్ చేస్తే మీరు నిర్మించినట్లా, నెల్లూరు జిల్లాకు మెడికల్ కళాశాల కావాలని జిల్లా వాసుల కల అని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గొడవలు చేసి సస్పెన్షన్ చేయించుకుని బయటకి వెళ్ళిపోతారని ఆయన విమర్శించారు.
ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్తే గొడవ పెట్టుకుంటారని, శాసనసభ, శాసనమండళ్లలో ప్రజాసమస్యలు చర్చించేందుకు ముందుకు రారు అంటూ ఆయన ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖపై చర్చ పెట్టాము, లోకేష్ వ్యక్తిగత విమర్శలకి దిగే ప్రయత్నం చేశారని, మీ దగ్గర సబ్జెక్టు లేదు కాబట్టి వ్యక్తిగత విమర్శలు, దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ మీద దాడులు, అధికారుల దగ్గర ఉన్న అజెండా కాపీలని చించి స్పీకర్ మీద వేశారని, చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్‌ని ఎన్నివిధాల ఇబ్బందులు పెట్టావో చెప్పాలన్నారు. ఎన్టీఆర్ కష్టంతో అధికారంలోకి వచ్చిన టీడీపీని ఇప్పుడు కా కుటుంబానికి ఎందుకు అప్పగించడం లేదని ఆయన అన్నారు. ఎంతసేపు లోకేష్ కి పార్టీని అప్పజెప్పాలని చూస్తున్నావ్ కానీ ఎన్టీఆర్ కుటుంబానికి సహకరిస్తున్నావా అని ఆయన ప్రశ్నించారు.