Minister Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు, తుఫానులను ఎలా ఎదుర్కొనాలో తనను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారని.. చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందని అర్థమవుతుందని మంత్రి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా చెప్పారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల కాలంలో పోలవరం గురించి పట్టించుకోలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ వైఎస్సార్ పోలవరం నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యంతోనే తుఫాన్ వల్ల రైతుల నష్టపోయారని చంద్రబాబు అంటున్నారని.. పూర్తి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. రైతులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..వ్యవసాయం దండగని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడారని.. పంటలు వేసుకోలేని పరిస్థితి ఎదుర్కొన్నారని మంత్రి చెప్పారు.
Read Also: Pawan Kalyan: దిక్కే లేకుండా పోయిన ఏపీని గాడిలో పెట్టాలి.. ఒక్కసారి జనసేనను నమ్మండి..
తుఫాన్‌ను తానే సముద్రంలోనే అణచివేశానని చెప్పుకున్నారని.. హుద్ హుద్ తుఫాన్లు ఫోటోలు తీసుకొని తానే అంతా చేసినట్లు ప్రచారం చేసుకున్నారని మంత్రి విమర్శలు గుప్పించారు. అధికారులను గాని స్థానిక ప్రజా ప్రతినిధులను గాని పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు హయాంలో కరువు మండలాలుగా ప్రకటించారే తప్ప కరువు నివారణ చర్యలు తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. అందుకే దానికి సంబంధించిన డేటా కూడా చెప్పలేకపోతున్నారని అన్నారు. చంద్రబాబు తన హయాంలో ఒక సాగునీటి ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు అయితే ఏవేవో కారణాలు చెప్పి ప్రజల నుంచి సానుభూతి కోసం ప్రయత్నించారన్నారు. తనకు అనారోగ్యమని చెప్పి బెయిల్ తీసుకున్నారని.. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు.. వ్యాధులు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకున్నారని ఆయన మండిపడ్డారు. పంటలు నష్టపోయినప్పుడు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఇచ్చారా అంటూ చంద్రబాబును మంత్రి కాకాని ప్రశ్నించారు. ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పంటలకు నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2015లో భారీ వర్షాల వల్ల మనుబోలు వద్ద జాతీయ రహదారి తెగిపోయిందని.. ఐదేళ్లలో ఈ రహదారిని చంద్రబాబు బాగు చేయలేకపోయారని, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పనులు పూర్తయ్యాయని మంత్రి చెప్పుకొచ్చారు.
Read Also: Botsa Satyanarayana: చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. “ఎకరాకు 30 వేల నష్టపరిహారం ఇవ్వాలని చెబుతున్నారు. ఆయన హయాంలో ఎప్పుడైనా ఇచ్చారా?. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఇటీవల చంద్రబాబు పర్యటించిన తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులెవరూ రాలేదు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే ప్రాణ నష్టం జరగలేదు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్ తుఫానుకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర బృందం జిల్లాల్లో పర్యటిస్తోంది. రైతులకు సంబంధించి ఉదారంగా వ్యవహరిస్తాం. అన్ని విధాలా ఆదుకుంటాం. చంద్రబాబుకు మతిమరుపు ఎక్కువైంది. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి నటించారు.. జైల్లో ఉన్నప్పుడు నటించారు.. ఇప్పుడు బయటకు వచ్చి కూడా నటిస్తున్నారు. చంద్రబాబు దగ్గర చెప్పించుకోవాల్సిన ఆగత్యం ప్రభుత్వానికి లేదు.” అని మంత్రి పేర్కొన్నారు.