Telangana Health Minister Harish Rao Criticized Union Government.
మరోసారి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులది గోబల్స్ ప్రచారం , ఫేక్ సోషల్ మీడియా ప్రచారమని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ నాయకులు చూసి ఓర్వలేక ఫేక్ ప్రచారాల చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిందని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. అసలు బీజేపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎవరికీ ఏమీ ఇచ్చింది లేదని, ఇచ్చే దాంట్లోనే కోతలు పెడుతున్నదని ఆయన స్పష్టం చేశారు.
బట్టేబాజ్, జూటేబాజ్ పార్టీ బీజేపీ అని ఆయన విమర్శించారు. సిద్దిపేట అభివృద్ధి పై ఈర్ష్య అంటే సిద్దిపేట ప్రజలపై ఈర్ష్య పడినట్టేనని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. అభివృద్ధి చూసి ఈర్ష్యతో ఏడ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీ నాయకులే అని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి హరీష్‌రావు.