Gudivada Amarnath: టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ఎపిసోడ్, చంద్రబాబు మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తీసుకొచ్చిన ఘటనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు శేష జీవితం అంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడపాల్సిందేనని జోస్యం చెప్పారు. మనవడు దేవాన్ష్ తో తాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లాడని చెప్పిన నారా భువనేశ్వరి.. ఇప్పుడు మనవడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎందుకు తీసుకువచ్చిందని ప్రశ్నించారు. తాతలా తప్పుడు పనులు చేస్తే.. నువ్వు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తావని మనవడితో చెప్పాలంటూ నారా భువనేశ్వరికీ సూచించారు. ఇక, చంద్రబాబుకు కోర్టు బెయిల్ ఎందుకు ఇచ్చిందో తెలియకుండా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుకు కళ్లు కనబడటం లేదు, ముసలివాడు అని హైకోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read Also: YSR Lifetime Achievement Awards: సామాన్యులుగా ఎదిగిన అసామాన్యులకు ఇస్తున్న అవార్డులు ఇవి..
కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.. ఇక, అనారోగ్య సమస్యలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో.. ఆయన మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.. ఆ తర్వాత రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకున్నారు.. రోడ్డు మార్గంలో టీడీపీ శ్రేణులు స్వాగతం పలుకుతుండగా ఆయన ముందుకు సాగగా.. విజయవాడ చేరుకోవాడనికి ఆయనకు 14 గంటల సమయం పట్టింది.