Minister Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నా ఆయన.. బీజేపీ పెద్దలతో సమావేశమై.. పొత్తులు, సీట్లపై చర్చించనున్నారట.. ఇక, చంద్రబాబు పర్యటన తర్వాత.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. మొత్తంగా.. త్వరలోనే జరగనున్న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి.. అయితే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు సమన్లు.. ఈడీ ముందు ఎందుకు హాజరుకాలేదో చెప్పాలి..
చంద్రబాబు ఎవరితో పొత్తు పెట్టుకున్నా మాకు సంబంధం లేని విషయం అన్నారు మంత్రి బొత్స.. ఎవరు..? ఎవరితో వెళ్లినా మా పై ప్రభావం ఉండదన్న ఆయన.. కానీ, మా పార్టీ ఎవరినీ వదులుకోదని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వారందరికి తగిన అవకాశాలు కల్పిస్తాం అని పేర్కొన్నారు. అసలు, అసంతృప్తికి నిర్వచనం ఏముంటుంది? అని ఎదురు ప్రశ్నించారు. ఇక, 2014లో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నా గన్ మెన్‌లను కూడా తీసేశారు అని గుర్తుచేసుకున్నారు.. నాకు థ్రెట్ లేదు గనుక భయం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కాగా, సచివాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి బొత్స.. డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.. మా ప్రభుత్వంలో విద్యకే తొలి ప్రాధాన్యత ఇస్తుందని.. 73 వేల కోట్ల రూపాయలను విద్య పై ఖర్చు పెట్టామని తెలిపారు. పిల్లలను గ్లోబల్ స్థాయి విద్యార్థులుగా తీర్చి దిద్దేందుకు ఫౌండేషన్ వేస్తున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెలకు రెండు సార్లు విద్యా శాఖ పై సమీక్షలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారని వెల్లడించారు. కొంతమంది ఇంగ్లీష్ మీడియం పై విమర్శలు చేశారు.. తర్వాత మనసు మార్చుకుని ఇంగ్లీష్ మీడియం అవసరాన్ని అర్థం చేసుకున్నారని.. పిల్లలకు ఉచితంగా ట్యాబ్ లు ఇచ్చే కార్యక్రమం ప్రతి ఏటా కొనసాగుతుందని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.