Botsa Satyanarayana: చంద్రబాబు అటు ఇటు తిప్పినా ముఖ్యమంత్రి కాలేడు.. 160 రోజుల్లోనే కాదు 664 రోజులైనా కూడా మళ్లీ సీఎం కాడు.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడన్నది కల, మర్చిపొండి ఇక అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడువి పనికిమాలిన మాటలు అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పమనండి..? అంటూ నిలదీశారు. చంద్రబాబు ఏం చేసారో చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. నా కార్యక్రమం ఇది, నాపేటెంట్ అని ఏ కార్యక్రమం గురంచైనా చెప్పగలరా? అంటూ సవాల్ చేశారు. లేనిపోని మాటలు , అబద్దాలు చెబుతున్నారు.. కానీ, ప్రజలు అమాయకులు కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోపిడీ చేసి, దోచుకుతిన్నారు అంటూ ఆరోపణలు చేశారు. ఇక, కొన్ని నిధులను మళ్లిస్తున్నారన్న విమర్శలపై స్పందించిన మంత్రి బొత్స.. ఏ డబ్బులు ఎక్కడా డైవర్ట్ చేయలేదు. ప్రజల కోసం, వారి జీవనప్రమాణాలు పెంచేందుకు నిధులు ఒక పథకం నుంచి మరో పథకానికి డైవర్ట్ చేస్తాం తప్ప.. అందులో వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఇక, తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై బొత్స విరుచుకుపడిన విషయం విదితమే.. ముందు వాలంటీర్ల విధివిధానాలు ఏంటో పవన్ కళ్యాణ్‌కు తెలుసా? అంటూ మంత్రి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఆడపిల్లలపై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టా అంటూ మాట్లాడారు. ఇది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అద్భుతమైన వ్యవస్థగా గుర్తింపు పొందిందని.. దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తాము చేసిన ఆరోపణలకు, సెలబ్రిటీ చేస్తున్న ఆరోపణలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ఇక, టీడీపీ సమయంలో సర్వే పేరుతో సమాచారం తీసుకుని ఓటర్ల లిస్ట్‌లో పేర్లు తొలగించారని.. అప్పుడు తానే డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ కల్యాణ్ ఆయన పార్టనర్ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటారని, ప్రజల డేటాను హైదరాబాద్‌లో ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ డేటా ఎక్కడ ఉందో పవన్ కళ్యాణ్‌కు తెలుసా? అంటూ ప్రశ్నించిన విషయం విదితమే.