Minister BC Janardhan Reddy: కంది పప్పు, బియ్యం ధర పెరిగిపోవడంతో.. సామాన్యులకు సబ్సిడీపై కంది పప్పు, బియ్యం పంపిణీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం.. ఈ రోజు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సబ్సిడీ ధరలతో నిత్యావసర సరుకుల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిలో కంది పప్పు రూ.160లకు, సోనా మసూరి బియ్యం కిలో రూ.48కే ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు.. మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసమే సబ్సిడీ ధరలతో నిత్యవసర సరుకులు సరఫరా చేస్తున్నామన్న ఆయన.. రైతు బజార్లకు సమాంతరంగా పేద ప్రజల కోసం సబ్సిడీ ధరల కౌంటర్లను తీర్చిదిద్దుతాం అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల కారణం గానే పేద ప్రజలను ఆదుకునేందుకు నిత్యవసర సరుకుల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక సబ్సిడీ కేంద్రాలను ప్రారంభిస్తాం.. త్వరలోనే అన్ని రకాల ధాన్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాగా, సామాన్యులకు తక్కువ ధరకే కంది పప్పు, బియ్యం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే.
Read Also: Secret Room : నేడు తిరిగి తెరుచుకోనున్న పూరిలోని జగన్నాథస్వామి ఆలయం రహస్య గది
కాగా, బనగానపల్లె పట్టణంలో గల గ్రంథాలయం పక్కన ఉన్నగ్రామపంచాయతీ సంబంధించిన రూమ్ నెంబర్ 1లో హోల్ సేల్ వ్యాపారస్తులు మరియు రైస్ మిల్లుల ఓనర్ల సహాయంతో సబ్సిడీతో నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయగా.. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్, డోన్ రెవిన్యూ డివిజనల్ అధికారి, ఇతర అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.