Ambati Rambabu: గుంటూరులో మంత్రి రజని కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆఫీస్ మీద రాళ్లు వేసి ఫ్లెక్సీలు చింపివేసి టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ వాళ్లు ఫ్రీ ప్లాన్‌డ్‌గా చేసిన చర్య ఇది అంటూ ఆయన ఆరోపించారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై దాడి చేయడం హింసను ప్రేరేపించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కార్యాలయం పై దాడి చేసిన వారిని క్షమించేది లేదన్నారు. దాడి చేసిన వారిని అణచివేస్తామని, చట్టం తన పని తాను చేస్తుందన్నారు. ఒక బీసీ మహిళ పోటీ చేస్తుంటే దమ్ముంటే ప్రజాస్వామ్య విధంగా పోటీ చేసి గెలవాలన్నారు. అంతేగాని బీసీ మహిళపై దాడి చేయడం మంచిది కాదన్నారు. టీడీపీ, జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో గుంటూరు ఘటనతో తెలిసిందన్నారు మంత్రి అంబటి రాంబాబు.
Read Also: Visakha: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
గతంలో ఖమ్మంలో నాపై కూడా ఓ సామాజిక వర్గం వాళ్లు దాడి చేశారు.. వాళ్లు కూడా మొత్తం టీడీపీ వాళ్లేనని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కాళ్లకున్న చెప్పులు తీసి బూతులు తిట్టి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని.. జనసేన సైనికులను అరాచక శక్తులుగా తయారు చేస్తున్నారని విమర్శించారు. ఇది దురదృష్టకరమైన పరిణామమన్నారు. నారా లోకేష్ రాసేది ఎర్రబుక్కో, ఎర్రి బుక్కో భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. కానీ ఎర్రబుక్కు పేరుతో మంత్రులను, అధికారులను బెదిరించడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. ఈ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని.. కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమన్నారు. కుప్పంలో గెలిచిన ఇన్నాళ్లకు, కుప్పం అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేకపోయినా దీన పరిస్థితి చంద్రబాబుదంటూ ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి కుప్పంలో సొంత ఇల్లు లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు లేదు… ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారంట అంటూ ప్రశ్నించారు. ప్రజలు ,మేధావులు ,చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ చేస్తున్న కుయుక్తులు ప్రజలు గమనించాలన్నారు.
Read Also: MP Mithun Reddy: చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. హౌసింగ్‌లో అవినీతి జరిగిందని, ల్యాండ్ ఎంక్వయిరీ విషయంలో అక్రమాలు జరిగాయని సీబీఐ విచారణ కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలనుకుంటే చేస్తుంది. రావణాసురుడికి పది తలకాయలు ఉన్నట్లు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఓ తలకాయి. గతంలో సీబీఐని రాష్ట్రంలో రావడానికి వీలు లేదని చెప్పిన చంద్రబాబు, అతని పార్ట్‌నర్ ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారు. చంద్రబాబు సీబీఐ ఎంక్వయిరీ అడగలేక, పవన్ కళ్యాణ్‌తో ఆ మాటలు అడిగిస్తున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కలియక రాష్ట్రానికి మంచిది కాదు. చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు. ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తాననే మనస్తత్వం చంద్రబాబుది. పదవి మీద ఎందుకు అంత వ్యామోహమో అర్దం కాదు. గతంలో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై దాడి చేశారు. ఖమ్మంలో నాపై దాడి చేశారు.ఇప్పుడు బీసీ మహిళ మంత్రి విడదల రజనీపై దాడి చేస్తున్నారు. విధ్వంసాలు చేయడం ద్వారా అధికారం సాధిద్దామని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ప్రజాస్వామ్యంలో దాడులు ప్రజలు క్షమించరు.” అని మంత్రి అన్నారు.