ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఆడిన మూడు మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న రోహిత్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రోహిత్ ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. రోహిత్ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడని, ఈ స్థానంలో మరో ఆటగాడు ఉండుంటే ఈ పాటికే జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చేదన్నాడు.
క్రిక్‌బజ్‌తో మైఖేల్ వాన్ మాట్లాడుతూ… ‘కెప్టెన్, ఆటగాడిగా భారత్, ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ముంబైని తిరుగులేని జట్టుగా నిలిపాడు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ ముంబైకి కెప్టెన్ కాదు, కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడుతున్నాడు. ఒక్కసారి రోహిత్ గణాంకాలు పరిశీలిద్దాం. ఇవే పరుగులు మరో ఆటగాడు చేసి ఉంటే.. ఈ పాటికే జట్టులో స్థానం కోల్పోవాడు. రోహిత్ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ అద్భుతమైన ఆటగాడు. అతడి నుంచి ఈ ప్రదర్శన సరికాదు. రోహిత్ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. అతడు తిరిగి తన ఫామ్ అందుకోవాలి. ముంబై తరఫున భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది’ అని అన్నాడు.
Also Read: Gold Rate Today: అయ్య బాబోయ్ ‘బంగారం’.. 93 వేలకు చేరుకున్న పసిడి!
ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ కొనసాగుతోంది. ఐపీఎల్ 2020 నుంచి 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలు 8 మాత్రమే ఉన్నాయి. హిట్‌మ్యాన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 105 నాటౌట్. 2024లో చెన్నైపై సెంచరీ చేశాడు. గత ఐదు ఐపీఎల్ సీజన్లలో రోహిత్ ఒక్కసారి మాత్రమే 400 పరుగుల మార్కును అందుకున్నాడు. 2020లో 332, 2021లో 381, 2022లో 268, 2023లో 332, 2024లో 417 రన్స్ చేశాడు.