Udayagiri: ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాజన్న దళం అధినేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించారు. అనంతరం ఉదయగిరి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సూచనల మేరకు ఆయన తమ్ముడు కాకర్ల సునీల్ ఆధ్వర్యంలో మంగళగిరిలో నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో లోకేష్ సమక్షంలో మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, ఆయన అనుచరుడు మాలేపాటి వెంకట్ తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా లోకేష్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, నీ రాజకీయ భవిష్యత్తు మేము చూసుకుంటామని లోకేష్ అభయమిచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలలో చిరంజీవి రెడ్డి అనుచర వర్గం ఉంది. కలిగిరి మండలంలో అత్యధిక మెజార్టీ సాధిస్తారు. మెట్టుకూరు టీడీపీలో చేరడంతో తెలుగుదేశం విజయం ఖాయమైందని లోకేష్ అన్నారు. ఈ విజయాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని తేలిపోయిందన్నారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ చిరంజీవి రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
Read Also: Summer Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి వేసవి సెలవులు..
ఈ సందర్భంగా రాజన్న దళం అధినేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయనపై అభిమానంతో రాజన్న దళం పార్టీని స్థాపించి నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరిచానని, ఆయన తనయుడికి అండగా ఉండాలని, రాజన్నదళం పార్టీని వైసీపీలో విలీనం చేశానన్నారు. దీనికి కారణం ప్రభుత్వంతో పాటు ఉదయగిరి నియోజకవర్గం సుదీర్ఘకాలం ఒకే కుటుంబంకు చెందిన వారు పరిపాలనలో ఉండటం మరీ ఈ ఐదేళ్ల కాలంలో మరింత దయనీయ స్థితికి చేరిందన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజలకు ఎలాంటి సహాయ సహకారం అందించలేక ఈ 5 సంవత్సరాలు మనోవ్యథకు గురయ్యానన్నారు. . దేవుడిదయవల్ల నాకు ఒక్క అవకాశం వస్తే మెట్టప్రాంత ప్రజల దశాబ్దాల కలలను సాకారం చేసుకునేలా సేవ చేయగలనని నమ్మి ఆదిశగా ప్రయత్నించానన్నారు. ఉదయగిరి నియోజకవర్గం అభివృద్దే ప్రాధాన్యతగా, నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలే శిరోధార్యంగా భావించి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద ఉన్న అపార గౌరవాన్ని సైతం పక్కన పెట్టి బాధాతప్త హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేడు రాజీనామా చేశానన్నారు. చాలా రోజులుగా తనకు జరుగుతున్న అవమానకరమైన రాజకీయ సమీకరణాలను చూశాక రాజకీయాలకు దూరంగా ఉండాలని మొదట నిర్ణయించుకుని మౌనంగా ఉండిపోయానన్నారు.
కానీ గత రెండేళ్లుగా ఉదయగిరి నియోజకవర్గంలో తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానమును సంపాదించుకున్న కాకర్ల సురేష్ సేవాభావాన్ని గుర్తించామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మంచి జరగాలంటే ఇలాంటి సేవాభావం కలిగిన వ్యక్తులకు రాజకీయాలకు అవసరం అని భావించి మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అదేవిధంగా మన ప్రాంతంలో గడచిన కొన్ని ఏళ్లుగా వాటర్ ప్లాంట్లు ఏర్పాట్లు లాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నానన్నారు.
ప్రజాసేవలో ఒకే భావసారూప్యత కలిగిన వీరిద్దరి నాయకత్వంలో ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి జరిగి తీరుతుందనే సంపూర్ణ విశ్వాసం కలగడంతో టీడీపీ చేరానని మెట్టూకూరు చిరంజీవి రెడ్డి స్పష్టం చేశారు.