NTV Telugu Site icon

Medigadda Barrage : హైకోర్టులో కేసీఆర్, హరీష్‌ రావు పిటిషన్‌పై విచారణ.. తీర్పు రిజర్వ్

Medigadda

Medigadda

Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై హైకోర్టులో న్యాయపరమైన పరిణామాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) , మాజీ మంత్రి హరీష్‌ రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు పూర్తయ్యాక హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి అనే వ్యక్తి క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు, కేసీఆర్ , హరీష్‌ రావులకు నోటీసులు జారీ చేసింది. అయితే, జిల్లా కోర్టుకు ఈ వ్యవహారంపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదని అభిప్రాయంతో, ఈ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు.

Bangladesh: బంగ్లాదేశ్ వైమానిక స్థావరంపై దాడి, ఒకరు మృతి..

కేసీఆర్, హరీష్‌ రావు తరఫు న్యాయవాదులు తమ వాదనల్లో జిల్లా కోర్టు హద్దులు అతిక్రమించిందని పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసే అధికార పరిధి లేకుండా, కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు వారు వాదించారు. దీనిపై హైకోర్టు వివరణ కోరగా, ప్రభుత్వ తరఫు న్యాయవాది (పబ్లిక్ ప్రాసిక్యూటర్) పిటిషన్‌ విచారణయోగ్యమేనని, దీనిపై సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ వాదనలు వినిపించారు.

ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు ఏమిటంటే, ఫిర్యాదుదారైన రాజలింగమూర్తి ఇటీవల హత్యకు గురయ్యారు. దీనిపై హైకోర్టు కీలక ప్రశ్నను లేవనెత్తింది – “ఫిర్యాదుదారు మరణించగా, పిటిషన్‌కు ఇక విచారణార్హత ఉందా?” దీనికి సమాధానంగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుప్రీంకోర్టు నిబంధనలను ప్రస్తావిస్తూ, ఫిర్యాదుదారు మృతి చెందినా కేసు కొనసాగవచ్చని స్పష్టం చేశారు.

ఇరువైపుల వాదనలు పూర్తయ్యాక, హైకోర్టు ఈ కేసుపై తీర్పును రిజర్వు చేసింది. కేసీఆర్, హరీష్ రావు వేసిన పిటిషన్‌పై ఏ నిర్ణయం వెలువడుతుందో అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, రాజకీయ వర్గాల్లో ఈ వివాదంపై చర్చలు కొనసాగుతున్నాయి. హైకోర్టు తీర్పు రాబోయే రోజుల్లో వెలువడే అవకాశముంది.

CM Revanth Reddy : రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు.. ప్రతినెలా రూ.600 కోట్ల వడ్డీనే కడుతున్నాం