ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ‘మేడారం’ మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని పూజారుల సంఘం ప్రకటించింది. సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం 2026 మేడారం మహాజాతర తేదీలను ఖరారు చేసి.. దేవాదాయ శాఖకు పంపించింది. త్వరలోనే దేవాదాయ శాఖ ఆమోదం తెలపనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మలు వెలిసి ఉన్న విషయం తెలిసిందే.
Also Read: ENG vs IND: నేటి నుంచే రెండో టెస్టు.. సందిగ్ధంలో భారత్! కలిసిరాని ఎడ్జ్‌బాస్టన్
శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ.. 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారం గద్దెలకు చేరుకుంటారని పూజారుల సంఘం తెలిపింది. 30న భక్తులు వనదేవతలు సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇక 31న అమ్మవార్ల వనప్రవేశం ఉంటుంది. నాలుగు రోజుల పాటు జాతర జరుగుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరను నిర్వహిస్తుంటారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.