Match Fixing in IPL: ఐపీఎల్ మ్యాచులంటేనే చివరిబంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ. అనూహ్య విజయాలు, ఓటముల్లో మాత్రం బెట్టింగ్‌ల కోసం ఫిక్సింగ్ చేశారనే టాక్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి సహజంగానే వినిపిస్తుంది. ఈ సీజన్‌లోనూ ఇలాంటి మ్యాచులు ఎక్కువే ఉన్నాయి. దీంతో కొన్ని మ్యాచుల్లో ప్లేయర్లు ఫిక్సింగ్‌కి పాల్పడి ఉంటారన్న అనుమానాలున్నాయి. ముంబై, జైపూర్ స్టేడియాల్లో బుకీలను గుర్తించి పోలీసులకు అప్పగించారన్న సమాచారంతో ఫిక్సింగ్ జరిగిందనే అనుమానాలు బలం చేకూరుతోంది. నలుగురు బుకీలు.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో లగ్జరీ బాక్సుల్లోకి వెళ్లి.. ప్లేయర్లను కలిసి ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నట్లు బీసీసీఐ గుర్తించింది. బుకీలు ఎంట్రీ పాస్‌ల ద్వారానే వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. వాళ్లకు పాస్‌లు ఎక్కడినుంచి వచ్చాయి.. ఏయే ప్లేయర్లను కలిశారు.. ఏ మ్యాచ్‌లను ఎలా ఫిక్సింగ్ చేశారనే కూపీ లాగుతున్నారు.
ముంబై ఇండియన్స్.., చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచే మ్యాచ్‌ను ఓడిపోయింది. ఈ మ్యాచ్ జరిగిన ముంబై వాంఖడే స్టేడియంలో బుకీలు పట్టుబడ్డారు. దీంతో ఫిక్సింగ్ జరిగిందా? అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై 206 పరుగుల భారీ స్కోరు చేస్తే చేజింగ్‌లో ముంబై బ్యాటర్లు మొదట్నుంచే తడబడ్డారు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడం, హార్థిక్ పాండ్యా.. ఆరు బంతుల్లో రెండు పరుగులకే ఔట్ కావడం, భారీ హిట్టర్ షెపర్డ్ ఒక పరుగే చేయడం, తిలక్ వర్మ డిఫెన్స్ ఆడడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
ఇక, జైపూర్‌లోని మాన్‌సింగ్ స్టేడియంలో కూడా బుకీలు పట్టుబడ్డారు. హోం గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. 42 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ మూడో వికెట్‌ను 172 పరుగుల వద్ద కోల్పోయింది. కెప్టెన్ సంజూ శాంసన్ 38 బంతుల్లో 68, రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76 రన్స్ తీశారు. వికెట్ తీసేందుకు గుజరాత్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. కానీ, క్యాచ్ డ్రాప్‌లతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. 196 పరుగుల చేజింగ్‌తో బరిలోకి దిగిన గుజరాత్.. 111 పరుగులకే 4 వికెట్లు, 133 పరుగులకు 5 వికెట్లు, 157 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. గెలిచే అవకాశం లేదని అంతా భావించారు. కానీ, ఏడో వికెట్‌కు రషీద్ ఖాన్ 11 బంతుల్లో 24, షారూఖ్ ఖాన్ 8 బంతుల్లో 14 చేయడంతో గుజరాత్ అనూహ్య విజయం సాధించింది.
ఎప్పుడో 11 ఏళ్ల క్రితం 2013లో జరిగిన ఐపీఎల్ లో ఫిక్సింగ్ కలకలం రేపింది. అప్పట్లో రాజస్థాన్, చెన్నై జట్లపై రెండేళ్ల నిషేధం విధించారు. మళ్లీ ఇప్పుడు ఆ రెండు జట్లు అనూహ్య విజయాలు సాధించడం.. బుకీలు పట్టుబడడంతో కలకలం రేగింది. నిజంగా ఫిక్సింగ్ జరిగిందా? లేదా? ఫిక్సింగ్ జరిగి ఉంటే ఏ టీమ్‌లో ఏ ప్లేయర్ ఫిక్సింగ్‌కు సహకరించాడనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈసారి ఫిక్సింగ్ నిజమని తేలితే ఎలాంటి చర్యలుంటాయనేది కూడా చర్చనీయాంశమవుతోంది.