Narayanpet: నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి ఇద్దరు చిన్న పిల్లలను హత్య చేసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన తీవ్రంగా కలచివేసింది. తీలేరు గ్రామానికి చెందిన శివరాం తన ఇద్దరు పిల్లలు రిత్విక (8), చైతన్య (5)లను కోయిల్ సాగర్ కెనాల్‌లోకి తోసివేసి హత్య చేశాడు. కెనాల్‌లో పడిన ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం శివరాం కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు గుర్తించి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
READ MORE: Nicolas Maduro: నేను చాలా మంచివాడిని.. అన్యాయంగా కిడ్నాప్ చేశారు.. కోర్టులో మదురో వ్యాఖ్య
పోలీసుల ప్రాథమిక విచారణలో శివరాం కొన్నేళ్లుగా భార్యతో దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సమస్యలే ఈ ఘోరానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.