ఆస్ట్రేలియాలో రేసిజం మొదలైంది. విపరీతమైన ద్వేషంతో ఇండియన్స్, ఇతర దేశస్థులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇమ్మిగ్రెంట్స్ గో బ్యాక్ అంటూ ర్యాలీలు చేపడుతున్నారు ఆస్ట్రేలియన్లు. స్కూళ్లో చదివే వాళ్లపైన, ఆఫీసుల్లో, కార్మికులపై వివక్ష చూపిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా వీధులన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరు దాడిచేస్తారోనని భయంతో బతుకుతున్నారు విదేశీయులు.
ఆస్ట్రేలియాలో మాస్ ఇమ్మిగ్రేషన్ ఆపేయాలని స్థానికులు ఆందోళన బాట పట్టారు. మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా.. పేరుతో మొదలైన ర్యాలీలు కార్చిచ్చులా దేశమంతా అంటుకున్నాయి. ర్యాలీల సందర్భంగా విదేశీయులపై దారుణంగా దాడులకు తెగబడుతున్నారు. సిడ్నీ మారథాన్ లో 35వేల మంది రన్నర్స్ పాల్గొన్నారు. అనంతరం సిటీలో ఉన్న ఒపెరా హౌస్ ను చుట్టుముట్టారు. ఈ ర్యాలీలో వేల మందికి పైగా పాల్గొని.. అక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు.
ఆగస్టు 31 ఆదివారం సిడ్నీలో మొదలైన ర్యాలీలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. సిడ్నితో పాటు ఇతర రాష్ట్రాల రాజధానులు, పట్టణాలు, గ్రామాలు రేసిజంతో అట్టుడికిపోయాయి. మాస్ ఇమ్మిగ్రేషన్ మా కమ్యూనిటీస్ ఏకతాటిపైకి తీసుకొచ్చాయన్నారు నిరసనకారులు. ప్రభుత్వం విదేశీయులను వెనక్కి పంపే ధైర్యం చేయలేరని తెలిపారు. కానీ తామే ఆ పని చేస్తున్నామని ప్రకటించారు. తమ సంప్రదాయాలు, సంస్కృతి, విద్య, ఉద్యోగాలు కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇండియన్స్ తమ ఉపాధిపై దెబ్బకొడున్నాయని ఆరోపించారు.