సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలోని మాండ్య ఇండిపెండెంట్ ఎంపీ సుమలత అంబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సుమలత ప్రకటించారు. 2019 ఎన్నికల్లో మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ బరిలోకి దిగి ఓడిపోయారు.
అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తులో భాగంగా మాండ్య సీటు జేడీఎస్‌కు దక్కింది. దీంతో ఇక్కడ కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కుమారస్వామి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అయితే ఈ టికెట్ సుమలతకు లభిస్తుందని అంతా భావించారు. కానీ కుమారస్వామి పోటీలోకి దిగడంతో ఆమె లోక్‌సభ బరి నుంచి తప్పుకున్నారు. ఎన్నికల్లో కుమారస్వామికి మద్దతు తెల్పుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఇటీవలే సుమలతను కుమారస్వామి కలిసి.. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశ ప్రజల కోసం, కర్ణాటక ప్రజల కోసం.. ప్రధాని కలలు నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుమలత చెప్పుకొచ్చారు. మాండ్య ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని తెలిపారు. మాండ్య ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానని.. మాండ్యను విడిచిపెట్టబోనని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లు సుమలత పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: JP Nadda: ‘‘సగం మంది జైలులో, సగం మంది బెయిల్లో’’.. ఇండియా కూటమిపై నడ్డా ఫైర్..
మాండ్య నుంచి మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మద్దతుదారులు కోరారని చెప్పుకొచ్చారు. అలా చేస్తే ఓట్లు చీలిపోయి.. బీజేపీకి ఇబ్బంది కల్గుతుందని పేర్కొన్నారు. వేరే నియోజకవర్గాల్లో పోటీ చేయాలని బీజేపీ ఆఫర్లు ఇచ్చిందని.. కానీ తాను మాత్రం మాండ్యను విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు. ప్రధాని మోడీ సలహా మేరకే.. పోటీ నుంచి తప్పుకుని బీజేపీలో చేరుతున్నట్లు సుమలత క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Kodanda Reddy: పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ను బదనాం చేస్తున్నారు..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమవుతుంది. అనంతరం ఏప్రిల 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.
ఇది కూడా చదవండి: Perni Nani: చంద్రబాబువి దొంగ నాటకాలు.. ఎప్పుడైనా 1వ తేదీన పెన్షన్లు ఇచ్చారా?