NTV Telugu Site icon

Manda Jagannatham : మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి… సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

Manda Jagannatham

Manda Jagannatham

Manda Jagannatham : మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మందా జగన్నాథం (73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుటుంబంలో భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1996లో తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన, మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం వరుసగా 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించి నాలుగు సార్లు ఎంపీగా ప్రజలకు సేవ చేశారు.

2009లో కాంగ్రెస్ పార్టీలో చేరిన జగన్నాథం, అదే స్థానం నుంచి మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన అనుభవాలను వినియోగించుకోవాలని నిర్ణయించి, 2018లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా న్యూఢిల్లీలో నియమించింది. ఈ పదవికి కేబినెట్ హోదా కూడా కేటాయించారు. పదవీకాలం ముగిసిన తరువాత మరోసారి అదే పదవిలో కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.

ఆనారోగ్యం , కన్నుమూసిన ఘటన
గతేడాది డిసెంబర్ చివరిలో ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ, నిమ్స్ ఆసుపత్రిలోని ఆర్‌ఐసీయూ విభాగంలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో 2025 జనవరి 12న ఆయన కన్నుమూశారు.

వ్యక్తిగత జీవితం
మందా జగన్నాథం కుటుంబం విద్య, వైద్యంలో ప్రాధాన్యతనిచ్చినది. కుమార్తె మంద పల్లవి ఎంఎస్ పూర్తి చేసి ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు మంద శ్రీనాథ్ బీటెక్ పూర్తి చేసి సోషల్ వర్కర్‌గా కొనసాగుతున్నారు. చిన్న కుమారుడు మంద విశ్వనాథ్ ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు.

జనసేవకుని మృతి పట్ల సంతాపం
మందా జగన్నాథం కన్నుమూయడం రాజకీయ, సామాజిక రంగాలకు తీరని లోటుగా చెప్పవచ్చు. రాజకీయ ప్రేరణతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన చూపించిన శ్రద్ధ ప్రత్యేకంగా గుర్తించదగినది. 73 ఏళ్ల వయసులో ఈ సేవకుడు తన జీవన యాత్ర ముగించడం పట్ల రాజకీయ నేతలు, అనుచరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం

మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాధం మృతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం సానుభూతిని తెలియజేశారు.. నాగర్ కర్నూల్ లోకసభ సభ్యునిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారునిగా మందా జగన్నాధం పాత్ర తెలంగాణ రాష్ట్రంలో మరుపురానిదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జగన్నాధం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. అయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుభూతి తెలియజేశారు.

 

 

Show comments