Viral Video: ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోల మోజు బాగా పెరిగింది. వ్యూస్ రావడం కోసం, ఫేమస్ కావడం కోసం యువత డిఫరెంట్‌గా తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. అయితే ఇలా కొన్ని రిస్కీ షాట్స్ తీసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. జలపాతాల వద్ద, వరదల్లో కూడా ఈ రీల్స్ కోసం పాకులాడుతూ తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యూస్ పెరగడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటకలో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ మోజులో పడి ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు.
Also Read: Teacher Suspended: విద్యార్థులతో క్లాస్‌రూమ్‌లో మసాజ్ చేయించుకున్న టీచర్ సస్పెండ్
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం జలపాతం వద్ద పోజులిస్తున్నాడు. మరో వ్యక్తి దానిని వీడియో తీస్తున్నాడు. కానీ ప్రమాదవశాత్తు పోజులిస్తున్న వ్యక్తి కాలు జారి జలపాతంలో పడిపోయాడు. ఆ సమయంలో జలపాతంలో వరద ప్రవాహం చాలా ప్రమాదకరంగా ఉండడంతో అతను ఆ నీటిలో కొట్టుకుపోయాడు. ఆ వ్యక్తిని శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన 23 ఏళ్ల శరత్ కుమార్‌గా గుర్తించారు. కొల్లూరు గ్రామానికి కేవలం 6 కి.మీ దూరంలో ఉన్న అరసినగుండి జలపాతం వద్ద ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఓ వ్యక్తి జలపాతంలోని రాయిపై నిలబడి ఉన్నాడు. ఆ నీటి ప్రవాహానికి ఆ వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయాడు. ఒక్క క్షణంలో జలపాతంలో పడిపోయి కనిపించకుండా అదృశ్యమయ్యాడు. పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయినప్పటికీ ఆ వ్యక్తి మృతదేహం ఆచూకీ లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్ ఈరోజు కూడా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Also Read: Delhi Crime: పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీ విద్యార్థిని తలపై రాడ్డుతో కొట్టి..
ఉడిపి జిల్లాలో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. బంట్వాళ తాలూకా సమీపంలోని నందవర, అలడ్క, గుడిన ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి నీరు చేరి నివాసితులు పరుగులు తీయాల్సి వచ్చింది. నైరుతి రుతుపవనాలు కర్ణాటకలో వరద భయాన్ని రేకెత్తించాయి. వాగులు పొంగి ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని తొమ్మిది జిల్లాలు బెలగావి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, హవేరి, హాసన్, శివమొగ్గ, ఉడిపి, దక్షిణ కన్నడ, కొడగులలో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. కర్ణాటకలోని మూడు కోస్తా జిల్లాలైన ఉడిపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Video: Man slips and falls in Karnataka Arasinagundi waterfalls while posing for Instagram Reel. Source: Truescoop pic.twitter.com/uG7ZTSjJNc
— Vivek Sabharwal (@vivek_sabharwal) July 25, 2023