Shots At Family Members: మోనోపోలీ గేమ్‌లో తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత అమెరికాలో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులపై కాల్పులకు తెగబడ్డాడు. మారణాయుధంతో దాడి చేసినందుకు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. యునైటెడ్ స్టేట్స్‌లోని తుల్సాలో ఓ కుటుంబం మోనోపోలీ ఆట ఆడుతోంది. ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. తుల్సా పోలీస్ అధికారుల ప్రకారం.. శనివారం సాయంత్రం ఒక ఇంటిపై కాల్పులు జరపగా.. బాధితులు చేసిన కాల్‌కు అధికారులు వెంటనే స్పంధించి ఘటనాస్థలికి చేరుకున్నారు.
Shraddha Walker Case: అధిక భద్రతల నడుమ అఫ్తాబ్‌కు మళ్లీ పాలిగ్రాఫ్ పరీక్ష
తుల్సాలోని ఓ కుటుంబం మద్యం సేవించి మోనోపోలీ గేమ్ ఆడుతోంది. ఆట నేపథ్యంలో జాన్ ఆర్మ్‌స్ట్రాంగ్, అతని సవతి తండ్రి మధ్య మెల్లగా గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో అతని సవతి తండ్రి.. గేమ్ బోర్డును విసిరికొట్టగా.. ఆర్మ్‌స్ట్రాంగ్ చేతికి గాయమైంది. దీంతో అతను కోపోద్రిక్తుడై తుపాకీ తీసి తన సవతి తండ్రిని, సవతి సోదరిని వీధిలో పరిగెత్తించాడు. వెంటనే సోదరి 911కి తనపై, ఆమె తండ్రిపై కాల్పులు జరిపాడని ఫిర్యాదు చేసింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కానీ అతని వద్ద తుపాకీని మాత్రం కనుగొనలేకపోయారు. అతను లొంగిపోయే ముందు తుపాకీని ఎక్కడో దాచిపెట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో వారి ఆట ఆడిన గదిని పరిశీలించిన అధికారులు అక్కడ డబ్బుతో పాటు మోనోపోలి బోర్డును కనుగొన్నట్లు తెలిపారు. అయితే వారు సరదాగా ఆడారా? లేదా బెట్టింగ్ ఆడారా? అనే దానిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.