Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలోనే ఢిల్లీ పీఠం నుంచి బీజేపీ వైదొలగడం ఖాయమని జోస్యం చెప్పారు. తన నివాసంలో టీఎంసీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఓ కీలక సమావేశంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో కొత్తగా ఏర్పాటైన సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస చోటుచేసుకుంటోందని, ఇందులో భాగంగా మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని మమతా ఆరోపించారు. అంతేకాదు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే హ్యాకర్ల (Hawkers) దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగ ఆశయాలను, విలువలను పూర్తిగా తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఎన్డీయే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ.. అతి త్వరలోనే కేంద్రంలో అధికారాన్ని కోల్పోవడం ఖాయమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న మమతా బెనర్జీ మేనల్లుడు, లోక్‌సభ ఎంపీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. కోల్‌కతాలోని తన నివాసంలో అనధికారికంగా నిర్మించిన భాగాలను కూల్చివేయాలంటూ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) ఆయనకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ నోటీసులు ఇచ్చిన కేఎంసీ (KMC) ఇప్పటికీ టీఎంసీ నియంత్రణలోనే ఉంది. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుడైన టీఎంసీ ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీమ్ ప్రస్తుతం కోల్‌కతా మేయర్‌గా ఉన్నారు. అయినప్పటికీ, ఈ నోటీసులపై అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ.. తాను ఇలాంటి బెదిరింపులకు అస్సలు లొంగే ప్రసక్తే లేదన్నారు. “వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు.. నా ఇల్లు కూల్చేస్తారా? నోటీసులు పంపుతారా? చేసుకోండి. ఇలాంటి వాటికి నేను తలవంచను. ఏది ఏమైనా బీజేపీకి వ్యతిరేకంగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది” అని తెగేసి చెప్పారు.

ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారిపై అభిషేక్ బెనర్జీ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సువేందు అధికారి గతంలో టీఎంసీలో ఉన్నప్పుడు 2014లో జరిగిన వివాదాస్పద ‘నారద స్టింగ్ ఆపరేషన్’ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. “మన రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు.. కానీ ప్రస్తుత సీఎం లాంటి వ్యక్తిని ఎవరూ చూసి ఉండరు. కెమెరా ముందు మనీ (డబ్బులు) తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు” అంటూ అభిషేక్ బెనర్జీ ఘాటుగా విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న హ్యాకర్ల బలవంతపు తరలింపులను, బీజేపీ తీసుకొచ్చిన ఈ “బుల్డోజర్ సంస్కృతి”ని నిరసిస్తూ మే 21 నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని టీఎంసీ నిర్ణయించింది. కోల్‌కతా పరిసర ప్రాంతాలైన బల్లిగంజ్, హౌరా జంక్షన్, సీల్దా రైల్వే స్టేషన్ అనే మూడు ప్రధాన ప్రాంతాల్లో ఈ నిరసన ప్రదర్శనలను నిర్వహించేందుకు టీఎంసీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.