గత కొద్ది రోజులుగా సందేశ్‌ఖాలీ ఘటనతో పశ్చిమబెంగాల్ (West Bengal) అట్టుడుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్, అతని మద్దతుదారులు భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం బీజేపీకి కూడా వారికి మద్దతుగా నిరసనలు చేపట్టింది. ఇక ప్రధాని మోడీ ఇటీవల బెంగాల్ పర్యటనలో సందేశ్‌ఖాలీ ఘటనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మమత సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి అండతోనే షాజహాన్ రెచ్చిపోయారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బాధిత మహిళలు కూడా మోడీని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుని ఆవేదన చెందారు. వారి మాటలు విన్న ప్రధాని కూడా కలత చెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి మమత (Mamata Banerjee).. భారీ ఎత్తున మహిళలతో కలిసి కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో మమత మాట్లాడుతూ.. బెంగాల్‌లో ఉన్న మహిళలంతా సురక్షితంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు వారంతా ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు. అలాగే హాథ్రస్‌లో ఒక అత్యాచార బాధితురాలి మృతదేహానికి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించినప్పుడు ఎక్కడున్నారని నిలదీశారు. బిల్కిస్ బానోని మరిచిపోయారా? అంటూ బీజేపీపై మమత విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రంలో మహిళలు అత్యంత సురక్షితంగా ఉన్నారని మమత చెప్పుకొచ్చారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీలో సందేశ్‌ఖాలీ ప్రాంతానికి చెందిన మహిళలూ పాల్గొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ముందు బెంగాల్‌లో హాట్ హాట్‌గా రాజకీయాలు సాగుతున్నాయి.