రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి ప్రతిపక్షాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు ధీటుగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ వంటి నేతలు ఈ విషయంపై చర్చిస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల గురించి మమతా బెనర్జీ ఢిల్లీలో సమావేశం నిర్వహించబోతున్నారు. జూన్ 15న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జాయింట్ మీటింగ్‌లో పాల్గొనేందుకు ప్రతిపక్ష సీఎంలకు లేఖ రాశారు. సీఎం కేసీఆర్ తో పాటు దేశంలోని ఎన్డీయేతర ముఖ్యమంత్రులు, ప్రధాన నాయకులకు ఫోన్లు చేస్తున్నారు మమతా బెనర్జీ.
మొత్తం 22 మందికి లేఖలు రాశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కూడా సమావేశానికి ఆహ్వానించారు.
ఇది జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 15న మమతా బెనర్జీ మీటింగ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. జూన్ 14-16 వరకు దీదీ ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే ప్రతిపక్షాల తరుపున ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలని ఎన్డీయేతర పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారు. ఇటీవల కర్ణాటక పర్యటనకు వెళ్లిన కేసీఆర్ ఆ సమయంలో మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో రాష్ట్రపతి ఎన్నికల గురించి చర్చించినట్లు సమాచారం. తాజాగా త్రుణమూల్ అధినేత్రి ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.