Mahesh-Rajamouli: సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన ‘ట్రిపుల్ ఆర్’ సినిమా అంతకు ముందు తీసిన ‘బాహుబలి’ సిరీస్ రేంజ్ లో ఆకట్టుకోకపోయినా, ఈ యేడాది టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలచింది. అంతేకాదు, ఆస్కార్ రేసులోనూ ‘ట్రిపుల్ ఆర్’ సాగనుందని తెలుస్తోంది. ఇలా ఎలా చూసినా రాజమౌళి ఏదో ఒకరకంగా వార్తల్లో నానుతూనే ఉంటారు. అలాంటి రాజమౌళి దర్శకత్వంలో తొలిసారి మహేశ్ బాబు నటించబోవడం నిజంగా విశేషమే! అది ఇరువురి అభిమానులకు ఆసక్తి కలిగించే అంశమే! మరి మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమా ఎలా ఉంటుందన్న ఇంట్రెస్ట్ ఫ్యాన్స్‌లో చోటు చేసుకోవడం సహజమే!
రాజమౌళి తండ్రి, ఆయన చిత్రాలకు కథకుడు అయిన విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమా గురించిన చిన్న మాట చెప్పారు. మహేశ్ తో రాజమౌళి సినిమా ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ను ఆధారం చేసుకొని తెరకెక్కనుందని విజయేంద్రప్రసాద్ తెలిపారు. గత మాసం టోరంటో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పాల్గొన్న రాజమౌళి కూడా తాను మహేశ్ తో తీయబోయే సినిమా గురించి పెదవి విప్పారు. మహేశ్ తో తీసే సినిమా జేమ్స్ బాండ్, ఇండియానా జోన్స్ తరహాలో అడ్వంచరస్ గా ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోని పలు దేశాలను చుడుతూ ఈ కథ రూపొందనుందనీ ఆయన మాటల్లో తేటతెల్లమయింది. వింటూ ఉంటేనే భలేగా ఉంది. రాజమౌళి గ్లోబ్ చుట్టేస్తూ సినిమా తీయడమంటే ఆసక్తి కలిగించే అంశమే కదా! ఇక ఈ సినిమా వచ్చే యేడాది తెరకెక్కనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేశ్ మూడోసారి నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే, రాజమౌళి చిత్రమే ఉంటుందని తెలుస్తోంది. మహేశ్ కూడా రాజమౌళితో కలసి పనిచేయాలని చాలా రోజుల నుంచీ ఎదురుచూస్తున్నారు. ఆ శుభముహూర్తం వచ్చే యేడాది చోటు చేసుకోనుంది. మరి, జక్కన్న ఎన్ని రోజుల్లో మహేశ్ సినిమాను చెక్కుతారో చూడాలి.