రాజ్యాంగ బద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడాన్ని మింగుడుపడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి మధుయాష్కీ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని త్వరలో ఆధారాలతో సహా బయటపెడుతామని మధు యాష్కీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లొనే 49 వేల కోట్ల అవినీతి జరిగిందని , కేంద్ర దర్యాప్తు సంస్థ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత గత 10 ఏళ్లలో తాను చేసిన అవినీతి బయటపడకుండా ఉండేందుకే బీసీ నినాదం ఎత్తుకుందని ఆరోపించారు.
ఏపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్న ఆయన వ్యాఖ్యలపై మధుయాష్కీ ధ్వజమెత్తారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , విజయసాయి రెడ్డిలు జైలు పక్షులని …. బెయిల్ పై బయట తిరుగుతున్నారనే విషయాన్ని గుర్తించుకోవలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మధుయాష్కీ హామీ ఇచ్చారు.