‘పిట్ట కొంచెం… కూత ఘనం…’ అనే సామెత కొందరిని చూస్తే నిజమే అనిపిస్తుంది. పిన్నవయసులోనే బాణీలు కట్టి అలరించిన శ్రీలేఖను చూసి, అప్పట్లో సినీజనం ఆ సామెతను భలేగా గుర్తు చేసుకొనేవారు. ఆ రోజుల్లో బాలమేధావిగా శ్రీలేఖ రాణించారు.
శ్రీలేఖ 1980 సెప్టెంబర్ 8న జన్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి బాబాయ్ కూతురే శ్రీలేఖ. బాల్యంలోనే పెదనాన్న శివశక్తిదత్త, అన్నయ్య కీరవాణి ప్రభావంతో శ్రీలేఖ సైతం సంగీతం అభ్యసించారు. చిన్నప్పుడే తాను మద్రాసు వెళ్లి, అక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడడం చూడాలని ఆశించేది శ్రీలేఖ. ఆమెలోని ప్రతిభను చూసి అబ్బురపడిన దర్శకనిర్మాత ఎస్.ఏ.చంద్రశేఖర్ తన తనయుడు విజయ్ తో రూపొందించిన ‘నాలైయ తీర్పు’ చిత్రంతో శ్రీలేఖను సంగీత దర్శకురాలిగా పరిచయం చేశారు. ఆ చిత్రంలో ఆమె పేరును మణిమేఖలగా ప్రకటించారు. తరువాత తెలుగులో దాసరి నారాయణరావు తన ‘నాన్నగారు’ సినిమాతో శ్రీలేఖను సంగీతదర్శకురాలిగా జనం ముందు నిలిపారు. ఈ సినిమాతోనే శ్రీలేఖ మంచి గుర్తింపు సంపాదించారు. దాసరి నారాయణరావుతో రామానాయుడు తెరకెక్కించిన ‘కొండపల్లి రత్తయ్య’కు కూడా శ్రీలేఖ స్వరకల్పన చేశారు. దాంతో రామానాయుడు తాను నిర్మించే చిత్రాలకు శ్రీలేఖనే సంగీత దర్శకురాలుగా ఎంచుకోవడం మొదలెట్టారు. అలా రామానాయుడు నిర్మించిన ‘తాజ్ మహల్’ చిత్రంతో శ్రీలేఖ జనం మదిని దోచే సంగీతం అందించారు. రామానాయుడు నిర్మించిన “ఒహో నా పెళ్ళంట, ధర్మచక్రం, శివయ్య, ప్రేయసి రావే, ప్రేమించు, శ్రీకృష్ణ 2006, హమ్ ఆప్కే దిల్ మే రహతే హై” చిత్రాలకు శ్రీలేఖ వినసొంపైన సంగీతం సమకూర్చారు.
శ్రీలేఖ స్వరకల్పనలో రూపొందిన “బొమ్మనా బ్రదర్స్ – చందనా సిస్టర్స్, టాటా బిర్లా మధ్యలో లైలా, అమ్మాయి బాగుంది, నిరీక్షణ, ఆపరేషన్ దుర్యోధన, శ్రీవల్లి” వంటి చిత్రాలలోని పాటలూ అలరించాయి. హిందీలోనూ శ్రీలేఖ బాణీల్లో “హమ్ ఆప్కే దిల్ మే రహతే హై, మేరే సప్నోంకీ రాణీ, ఆఘాజ్” వంటి చిత్రాలు మురిపించాయి. తన అన్న కీరవాణి స్వరకల్పనలో శ్రీలేఖ పాటలు పాడారు. అలాగే మరో అన్న రాజమౌళి తెరకెక్కించే చిత్రాలలోనూ పాలుపంచుకుంటూ ఉంటారు శ్రీలేఖ. ఈ నాటికీ తన దరికి చేరిన చిత్రాలకు న్యాయం చేయాలనే శ్రీలేఖ తపిస్తున్నారు.