నైరుతి బంగాళాఖాతంలో రేపు (బుధవారం) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్యంగా పయనించి ఈనెల 24వ తేదీ వరకు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల చివర వరకు తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అయితే, ఈశాన్య దిశగా కదులుతూ బలపడనున్న అల్పపీడనం.. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. ఐదు రోజుల పాటు ఏపీలో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కాగా, కొన్ని చోట్ల క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొనింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.. మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే ఛాన్స్ ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద వెల్లడించారు.
Read Also: Ananya Panday: అల్ట్రా స్టైలిష్ ఫోజులతో కేక పెట్టిస్తున్న అనన్య పాండే
కాగా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తుఫాన్ తీరం దాటుతుందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలను జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. వాయుగుండం గమనంపై బుధవారానికి మరింత క్లారిటీ వస్తుందని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా బలపడే క్రమంలో రాష్ట్రంలో ఎండలు పెరిగి గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరుగుతాయని హెచ్చరించారు. ఎండలు పెరిగే క్రమంలో వడగాడ్పులకు అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే, ఎండ తీవ్రత, ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉంది. అయితే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చింది.