రాష్ట్రవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. అమ్మాయి ప్రేమించడం లేదనో, ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో, పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ అండర్ బ్రిడ్జ్ సమీపంలోని ఏడు మోరీల దగ్గర రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు తీవ్ర గాయాలతో, రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఖమ్మం జిల్లా సారధి నగర్ కు చెందిన యువతిగా గుర్తించారు. చికిత్స పొందుతున్న యువకుడు వరంగల్ కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
READ MORE: Chandrababu: ఆ నియామకాలు వాయిదా వేయాలి.. యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ
ఈ ఆత్మహత్య యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమా? మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. యువతి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా.. ఈ ఘటన తెలియగానే యువతి, యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు దర్యప్తు అనంతరం వెల్లడించే అవకాశం ఉంది.