Lord Hanuman gets eviction NOTICE from Railways: జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. తమ స్థలం కబ్జా చేశారంటూ ఏకంగా ‘‘భగవాన్ హనుమాన్’’కే నోటీసులు ఇచ్చింది రైల్వే శాఖ. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నగరంలో చోటు చేసుకుంది. రైల్వే స్థలం ఆక్రమణకు గురైందని పేర్కొంటూ.. హనుమాన్ ఆలయాన్ని తొలగించి ఖాళీ చేయాలని ఆలయం గోడకు నోటీసులు అంటించారు. స్థలాన్ని 10 రోజుల్లో రైల్వే సెక్షన్ ఇంజనీర్ కు అప్పగించానలి కోరారు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నేరుగా హనుమంతుడిని ఉద్దేశిస్తూ రైల్వే శాఖ నోటీసులు ఇవ్వడం.
హనుమంతుడిని ఉద్దేశిస్తూ.. మీరు రైల్వే భూమిని అక్రమంగా ఆక్రమించారు..ఇది చట్టరీత్యానేరం. ఈ స్థలాన్ని 10 రోజుల్లోనే ఖాళీ చేయాలని.. లేకపోతే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసుల్లో చివరి వ్యాఖ్యలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించాలని పేర్కొనడం విశేషం.
Read Also: Tamil Nadu: స్కూల్ విద్యార్థితో లవ్.. పోక్సో కేసులో మహిళా టీచర్ అరెస్ట్.. చెన్నైలో సంచలనం..
హనుమాన్ ఆలయానికి సమీపంలో ఉన్న ఖాటిక్ బస్తీలో నివసిస్తున్న సుమారు 60 మందికి రైల్వే స్థలాలను ఆక్రమించారని నోటీసులు అందించారు. ఈ సమయంలో హనుమాన్ ఆలయం నిర్మాణం కూడా రైల్వే స్థలంలో జరిగిందంటూ రైల్వే శాఖ పేర్కొంటోంది. అయితే అక్కడి నివాసితులు మాత్రం 1921 నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని.. పండ్లు, చేపలు, కూరగాయలు వంటి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నమని అంటున్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న ఇళ్లన్నీ ఖాళీ చేయాలని రైల్వే శాఖ నోటీసులు ఇచ్చింది. రైల్వే శాఖ నోటీసులను స్థానికులు వ్యతిరేకించారు. సోమ, మంగళవారాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయ సమీపంలోకి చేరుకుని రైల్వే నోటీసులపై నిరసన తెలిపారు.