Love with school student. teacher arrested in POCSO: తమిళనాడులో ఓ స్టూడెంట్ ఆత్మహత్య సంచలనంగా మారింది. ప్రేమ పేరుతో తనను మహిళా టీచర్ మోసం చేసిందని.. 12వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా ఈ కేసులో చదువు ఇష్టం లేకపోవడంతోనే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని అనుకున్నప్పటికీ.. తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీచర్-విద్యార్థి మధ్య ప్రేమనే విద్యార్థి మరణానికి కారణం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సదరు టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నైలోని అంబత్తూర్ లో 12 తరగతి విద్యార్థి కృష్ణకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంబత్తూర్ గంగైనగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్నాడు. గత మేలో పాఠశాల విద్యను పూర్తి చేసిన కృష్ణ కుమార్ సెప్టెంబర్ 30న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Human Brain Cells: ఎలుకల్లో మానవ మెదడు కణాలను అమర్చిన శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా?
ఇదిలా ఉంటే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్ లో తాత్కాలికంగా పనిచేస్తున్న టీచర్ షర్మిళను అక్టోబర్ 12న అరెస్ట్ చేశారు. గత మూడేళ్లుగా షర్మిళ వద్ద కృష్ణకుమార్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఇటీవల షర్మిళకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అప్పటి నుంచి కృష్ణకుమార్ తో మాట్లాడటం మానేసింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల తన ఇంటిలోని బెడ్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విద్యార్థి కృష్ణకుమార్ తో, మహిళా టీచర్ షర్మిళ మాట్లాడిన వాయిస్ రికార్డులు, మెసేజులు సెల్ ఫోన్ లో ఉన్నాయి. ఇది చూసిన పోలీసులు వీటి ఆధారంగా షర్మిళపై కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, పోక్సో తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టయిన షర్మిళని జైలుకు పంపారు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పాఠశాల మహిళా టీచర్ ని పోక్సో చట్టం కింద అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది.