Liquor on Road: ఏ కాలంలో అయినా డబ్బులు వచ్చే వ్యాపారం ఏదైనా ఉందంటే అది మద్యం వ్యాపారమే. పరిస్థితి ఎలా ఉన్నా.. రేటు ఎలా ఉన్నా మద్యం బాటిళ్ల కోసం మందుబాబులు ఎగబడతారు. అందులోనూ ఇక ఉచితంగా దొరికితే వదిలిపెట్టే సమస్యే లేదు. తాజాగా విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మది వద్ద ఉచిత మద్యం కోసం జనాలు ఎగబడ్డారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా మనోళ్లు వదలరు. అలాంటిది క్వాటర్ బాటిల్స్ దొరికితే, బీరు బాటిల్స్ బాక్సులు కనపడితే వదులుతారా..?
Also Read: TDP-Janasena Manifesto Committee: ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటుచేసిన టీడీపీ – జనసేన
వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా మధురవాడ కొమ్మది వద్ద మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న లిక్కర్ బాక్సులు మొత్తం రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. లారీ అలా బోల్తా కొట్టిందో లేదో మందుబాబులు అలా పట్టేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు మద్యం బాక్సులను చూసి వెంటనే తమ వాహనాలను ఆపారు. రోడ్డుపై పడిన మద్యం బాటిళ్లను అందిన కాడికి ఎత్తుకెళ్లారు. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్లీ రాదని భావించి బాటిళ్లకు బాటిళ్లు పట్టుకెళ్లారు. రోడ్డుపై పడ్డ మద్యం బాటిళ్లను అందినకాడికి అందినట్టు పట్టుకొని స్థానికులు వెళ్లిపోయారు. కొందరైతే పెట్టెలను కూడా ఎత్తుకెళ్తూ కనిపించారు. అయితే లారీలో ఉన్న డ్రైవర్ సంగతి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగే సమయానికి రోడ్డుపై బాటిల్స్ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు.