తల్లిదండ్రులిద్దరూ సీనియర్ ఐఏఎస్‌లు. అంతమాత్రమే కాదు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతమైన పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిద్దరికి ఉండే ప్రొటోకాల్.. వారి హోదా.. వారి సంపద.. ఇక ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి కుటుంబంలో పుట్టిన సంతానానికి ఎలాంటి భోగభాగ్యాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. కోరుకున్నది తినొచ్చు.. కావాల్సిన చదువు చదవొచ్చు. ఇక ఏ పనైనా కూడా ఈజీగా చేయించుకోవచ్చు. అలాంటిది.. ఏం కష్టమొచ్చిందో.. ఏమో తెలియదు గానీ.. వారి పుత్రిక తనకు తానుగా మరణశాసనం రాసుకుంది. ఇంకా కోడి కూయకముందే.. అందరూ గాఢనిద్రలో ఉండగానే.. నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.
ఆమె పేరు లిపి.. వయస్సు 27 ఏళ్లు.. లా కోర్సు చదువుతోంది. ముంబై నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో నివాసం.. అమ్మానాన్నలిద్దరూ ఐఏఎస్‌లు.. అంతేకాదు మహారాష్ట్ర ప్రభుత్వంలో రాధిక, వికాస్ రస్తోగి కీలక శాఖల్లో పని చేస్తున్నారు. వీరి కుమార్తె లిపి రస్తోగి.. తాను నివాసం ఉండే హైరైజ్ టవర్‌లోని 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెల్లవారుజామున 4గంటలకు చోటుచేసుకుంది. ఆమెను చూసిన వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
లిపి.. హర్యానాలో సెయింట్ జేవియర్స్ కాలేజీలో లా కోర్సు చదువుతోంది. కంటెంట్ రైటర్‌గా కొంతకాలం.. బ్యూటీ కన్సల్టెంట్‌గా మరికొంత కాలం పని చేసింది. అంతేకాకుండా యూనిలివర్, నైకా వంటి పెద్ద కంపెనీల్లో మార్కెటింగ్ స్ట్రీమ్‌లో కూడా పని చేసింది. జూన్ 3 (సోమవారం) తెల్లవారుజామున 4 గంటలకు లిపి 10 అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఆమె రాసిన సూసైడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ రాసింది. తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. దీనికి ఎవరు బాధ్యులు కారని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువులో ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
2017లో కూడా ఇదే తరహాలో మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు మిలింద్, మనీషా మహీస్కర్ తమ 18 ఏళ్ల కుమారుడిని కోల్పోయారు. ముంబైలో ఎత్తైన భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
ఇక లిపి తల్లిదండ్రులైన వికాస్ రస్తోగి మహారాష్ట్ర విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాధికా రస్తోగి రాష్ట్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.