Leopard Hulchul: అదిగో చిరుత, ఇదిగో చిరుత అంటూ చిరుత సంచారం రాజమండ్రి శివారు ప్రాంత ప్రజలను భయాందోళన గురిచేస్తుంది. నాలుగు రోజులుగా కంటిపై కునుకు లేకుండా. భయంతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయపడుతున్నారు . చిరుతను పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అధికారులు ట్రాప్ కెమెరాలను, బోన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజమండ్రి శివారు దివాన్ చెరువు సమీపం ప్రాంతంలో ప్రజల భయం భయంగా గడుపుతున్నారు. పులి సంచారం చేస్తున్న ప్రాంతాలుగా భావిస్తున్న చోట దండోరా వేయించి ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశారు. పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దివాన్‌చెరువు సమీపంలో చిరుతపులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు.. లాలాచెరువు, దివాన్‌చెరువు సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల సాయం.. సీఎం చంద్రబాబు అభినందనలు
మరో వైపు.. చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు, వదంతులు నమ్మవద్దని.. ఎవరైనా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఫారెస్ట్ అధికారి ఎస్.భరణి హెచ్చరించారు. చిరుత సంచారంపై సోషల్ మీడియాలో గాయపడిన ఒక వ్యక్తి ఫొటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఇటువంటి ఫేక్ న్యూస్‌లను నమ్మి భయపడవద్దన్నారు. ప్రజలు నివాస ప్రాంతాల్లో తమ ఇళ్ల ముందు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రుళ్లు చీకటిగా వున్న ప్రాంతంలోనికి వెళ్ళవద్దన్నారు. ఫారెస్ట్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా నివాసిత ప్రాంతాల్లో ప్రహారా కాస్తున్నారన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్‌లు లా అండ్ ఆర్డర్ పరిధిలోనికి వస్తాయని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటువంటి ఫేక్ మెసేజ్‌లు చూసినవారు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కు సహకరించాలని కోరారు.