Legend Cricket League: డిసెంబర్‌లో లెజెండ్ క్రికెట్ లీగ్ విశాఖలో జరగబోతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. క్రిస్ గేల్, గంబీర్, షేన్ వాట్సన్.. ఇలా 15 నుంచి 20 మంది దిగ్గజ క్రికెటర్లు విశాఖలో మ్యాచ్‌లు ఆడబోతున్నారని ఆయన తెలిపారు. దులీప్ ట్రోఫీలో ఒక స్టేట్ నుంచి నలుగురు ప్లేయర్లు ఆడిన ఘనత ఆంధ్రకే దక్కుతుందన్నారు. హనుమ విహారి, కేయస్ భరత్, రిక్కీ భువి, శశికాంత్ ఆడారని గోపినాథ్ రెడ్డి చెప్పారు. ఐపీఎల్‌లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్లేయర్లను సెలెక్ట్ చేశారని పేర్కొన్నారు. వారికి టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆంధ్ర నుంచి ఆడేవారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు బీసీసీఐ కూడా ముందుకు వచ్చిందన్నారు.
Also Read: HCA Funds Issue: హెచ్‌సీఏలో నిధుల గోల్‌మాల్ కేసు .. హైకోర్టుకు అజారుద్దీన్
ఫిబ్రవరి 2న ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ విశాఖలో జరగబోతుందని ఆయన వెల్లడించారు. ఇన్ని టోర్నీలు నిర్వహిస్తున్నాం అంటే మా స్టాఫ్ కృషి చాలా ఉందన్నారు. ఉమెన్ టీ20 లీగ్ చేసిన ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ని మ్యాచ్‌లు విశాఖ తీసుకొని రావడానికి చాలా కష్టపడ్డామన్నారు. ఈ మ్యాచెస్ చూసేందుకు విద్యార్థులకు ఫ్రీగా పాసులు ఇవ్వబోతున్నామని చెప్పారు. సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ మళ్ళీ విశాఖలో జరగబోతుందని.. టీ20 మ్యాచ్ కోసం బీచ్ రోడ్డులో స్క్రీన్స్ పెడుతున్నామన్నారు. దేశంలో ఉన్న అన్ని స్టేడియాల కంటే విశాఖ స్టేడియంలో రేట్లు తక్కువ అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపినాథ్ రెడ్డి స్పష్టం చేశారు. బీసీసీఐ ఇచ్చిన పేటీఎంకే టికెట్స్ విక్రయాలు ఇస్తున్నామన్నారు. నిజమైన క్రికెట్ అభిమానులకు టికెట్స్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. గతంలో టికెట్స్ లోకల్ వాళ్లకు ఇవ్వడంలో సక్సెస్ అయ్యామని.. 7 వేల కొత్త చైర్స్ వేస్తున్నామని ఆయన తెలిపారు.