ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పట్టాభి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో పట్టాభి అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. పట్టాభి చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య రణరంగంగా మారాయి. ఇప్పటికే ఏపీ పోలీసులు కూడా పట్టాభి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఇది నేరమని, దీనిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే పట్టాభి కావాలనే వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందంటూ వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టాభిని విచారించి పోలీసులు నోటీసులు ఇస్తారా లేదా ఆయన్ను అదుపులోకి తీసుకుంటారో తెలియాల్సి ఉంది.